దుబాయ్: ప్రపంచ క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ నిరీక్షణకు తెరపడింది. ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ఎట్టకేలకు విడుదల చేసింది. తీవ్ర తర్జనభర్జనలు, చర్చోపచర్చల అనంతరం హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్న ఈ మెగా టోర్నీని వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలలో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిపించేందుకు ఐసీసీ ముహూర్తం ఖరారు చేసింది.
8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడనున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 19న ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. ఇక హైఓల్టేజ్ మ్యాచ్ అయిన భారత్, పాకిస్థాన్ పోరుకు ఫిబ్రవరి 23న దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న పాక్.. గ్రూప్ దశలో తమ మ్యాచ్‌లను కరాచీ, దుబాయ్, రావల్పిండిలలో ఆడనుంది.
గ్రూప్ దశలో ప్రతి జట్టు తమ గ్రూపులోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. మార్చి 2 దాకా గ్రూప్ దశ మ్యాచ్‌లు.. 4, 5 తేదీలలో రెండు సెమీస్‌లు జరుగనుండగా మార్చి 9న ఫైనల్ (మొత్తం 15 మ్యాచ్‌లు) జరుగుతుంది. భారత్ ఆడే మ్యాచ్‌లకు దుబాయ్ ఆతిథ్యమివ్వనుండగా పాక్‌లో జరుగబోయే మ్యాచ్‌లను కరాచీ, లాహోర్, రావల్పిండిలో నిర్వహిస్తారు. ఒకవేళ భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే ఫైనల్‌ను దుబాయ్‌లో నిర్వహించనున్నారు. లేకుంటే టైటిల్ పోరుకు లాహోర్ ఆతిథ్యమివ్వనుంది. రెండు సెమీస్లతో పాటు ఫైనల్‌కూ రిజర్వ్ డే ఉంది.