Jasprit Bumra | ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అద్భుత ప్రదర్శన చేసిన భారత్ మిస్టరీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నూతన సంవత్సరం రోజున భారీ ఫీట్‌ను సాధించాడు. తాజాగా టెస్టుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ బుధవారం టెస్ట్ ర్యాకింగ్స్‌ను విడుదల చేసింది. బౌలర్ల జాబితాలో బుమ్రా అగ్రస్థానంలో నిలిచి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా తొమ్మిది వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో బుమ్రా 30 వికెట్లు పడగొట్టాడు. దాంతో బుమ్రా రేటింగ్ పాయింట్లు 907కి పెరిగాయి. ఇది భారత క్రికెట్ జట్టు చరిత్రలో ఏ బౌలర్‌కు అయినా అత్యుత్తమ రేటింగ్ పాయింట్స్ కావడం విశేషం. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్ట్‌కు ముందు బుమ్రా 904 పాయింట్లు ఉన్నాయి. అత్యధికంగా రేటింగ్ పాయింట్ల పరంగా మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డును సమం చేశాడు. 2016లో అశ్వి అత్యధిక రేటింగ్ పాయింట్లు (904) సాధించాడు. తాజాగా బుమ్రా 907 పాయింట్లతో ఆ రికార్డును అధిగమించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో బుమ్రా 200 టెస్టు వికెట్ల క్లబ్లో చేరాడు. మ్యాచుల విషయానికి వస్తే.. టెస్టుల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో బుమ్రా రెండోస్థానంలో ఉండగా.. ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్ బుమ్రా. కేవలం 44 టెస్టుల్లో ఈ ఘనత అందుకోగా.. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 37 టెస్టుల్లో 200 వికెట్ల క్లబ్లో చేరి.. మొదటి స్థానంలో ఉన్నాడు. బంతులపరంగా టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా నాలుగో స్థానంలో ఉన్నాడు. 8484 బంతులు వేసి 200 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో పాక్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ అగ్రస్థానంలో ఉన్నాడు.
అత్యధిక రేటింగ్ పాయింట్లు 17వ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ డెరెక్ అండర్వుడ్ రికార్డును సమం చేశాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ సిడ్నీ బర్న్స్ (932) రేటింగ్ పాయింట్లతో ఈ ఆల్-టైమ్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. జార్జ్ లోహ్మాన్ (931), ఇమ్రాన్ ఖాన్ (922), ముత్తయ్య మురళీధరన్ (920) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తాజాగా ర్యాకింగ్స్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ సైతం ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. నాలుగో టెస్టులో ఆరు వికెట్లు తీసిన ఆసిస్ కెప్టెన్ బౌలర్ల ర్యాకింగ్స్లో ఒక స్థానం మెరుగుపరుచుకొని మూడో ప్లేస్‌కి చేరాడు. తొలి స్థానంలో బుమ్రా కొనసాగుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో జోష్ హేజిల్‌వుడ్ ఉన్నాడు. కమిన్స్ 15 రేటింగ్ పాయింట్లు పెరిగాయి. టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకున్నాడు. మెల్బోర్న్ టెస్టులో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు.
బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో బ్యాటింగ్ ఆకట్టుకున్నాడు. మెల్బోర్న్ టెస్టులో అర్ధ సెంచరీలు చేయగా.. ర్యాకింగ్స్ మెరుగుపరుచుకొని నాలుగో ప్లేస్‌కు చేరుకున్నాడు. ఇంతకు ముందు ఐదోస్థానంలో కొనసాగగా.. వరుస అర్ధ సెంచరీలతో ర్యాంకు మెరుగైంది. ప్రస్తుతం జైస్వాల్ ఖాతాలో 854 రేటింగ్ పాయింట్లు ఉన్నారు. మెల్బోర్న్లో టెస్టు కెరీర్లో తొలి సెంచరీ సాధించిన నితీశ్‌కుమార్‌రెడ్డి బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 20 స్థానాలు ఎగబాకి 53వ స్థానానికి చేరుకున్నాడు. అయితే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా ఒక స్థానం దిగజారి.. పదో స్థానానికి చేరుకున్నాడు.