న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌కు మరింత వన్నె తెచ్చేందుకు .. మూడు క్రికెట్ బోర్డులు పెద్ద ప్లాన్ వేశాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా క్రికెట్ బోర్డులు.. టెస్టు క్రికెట్ మ్యాచ్‌లను రెండు విభాగాలుగా(Two-Tier Test Cricket) నిర్వహించేందుకు ప్రణాళిక చేపట్టినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా ఈ ప్లాన్ అమలుకు రెఢీ ఉన్నట్లు తెలుస్తోంది. టెస్టులు ఆడే ఏడు జట్లు టాప్ డివిజన్లో, మరో అయిదు జట్లు సెకండ్ ర్యాంక్ డివిజన్లో పోటీ పడే రీతిలో ప్రణాళిక తయారు చేస్తున్నారు. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మాత్రం ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఉండే తరహాలో ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల విజయవంతంగా ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తరహాలో.. ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ల సంఖ్యను పెంచాలనుకుంటున్నారు. ఐసీసీ చైర్మెన్ జేషా, క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మెన్ మైక్ బెయిర్డ్, ఈసీబీ చైర్మెన్ రిచర్డ్ థాంప్సన్ దీనిపై చర్చించనున్నారు. ఈనెల 12వ తేదీన ముంబైలో జరిగే మీటింగ్‌లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. అయితే రెండు డివిజన్లుగా పోటీ పడే టెస్టు మ్యాచ్‌లను 2027 తర్వాతే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి టూ టైర్ కాన్సెప్ట్‌ను తొలుత ఇండియన్ బోర్డు వ్యతిరేకించింది. బెస్ట్ వర్సెస్ బెస్ట్ టెస్టు మ్యాచ్‌లతో షెడ్యూల్ చాలా దెబ్బతింటుందని గతంలో రవిశాస్త్రి ఆరోపించారు. కానీ టెస్టు క్రికెట్ జీవించాలంటే, రెండు బలమైన జట్ల మధ్య పోటీ ఉండాల్సిందే అన్నారు. ప్రస్తుతం నాలుగేళ్లకు ఒకసారి రెండు ప్రధాన జట్ల మద్య రెండు సార్లు టెస్టు సిరీస్ జరుగుతున్నది. అయితే కొత్త ప్లాన్ ప్రకారం.. మూడేళ్లకే రెండు సార్లు పెద్దపెద్ద జట్లు పోటీపడేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో టీ20 క్రికెట్ క్రేజీ ఉన్న కారణంగా.. ఈ కొత్త ప్లాన్‌ను వేగంగా అమలు చేయాలన్న ఆలోచనలో ఆ బోర్డులు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు విభాగాలుగా టెస్టు క్రికెట్ నిర్వహించాలన్న కాన్సెప్ట్‌ను 2016లోనే ఐసీసీ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆరంభంలో చిన్న దేశాలకు బీసీసీఐ మద్దతు ఇవ్వడం వల్ల ఆ ప్లాన్ వికటించింది. కానీ ఇప్పుడు జే షా.. మూడు పెద్ద బోర్డుల మధ్య టెస్టు క్రికెట్ నిర్వహణకు అనుకూలం ఉన్న కారణంగా.. ఆ కాన్సెప్ట్‌కు మళ్లీ జీవం పోసినట్లుగా అయ్యింది.
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గందరగోళంగా ఉన్నట్లు కొన్ని దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలోనూ కొత్త కాన్సెప్ట్‌కు గ్రీన్ సిగ్నల్ దక్కే అవకాశాలు ఉన్నాయి.