ICC : అంతర్జాతీయ క్రికెట్లో పలు మార్పులకు సిద్ధమైన ఐసీసీ(ICC) త్వరలోనే మరోసారి సమావేశం కానుంది. ఈసారి జరుగబోయే వార్షిక సమావేశం(Annual Conference)లో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈసారి సింగపూర్ వేదికగా మీటింగ్ జరుగనుంది. జూలై మూడో వారంలో ఈ మీటింగ్ నిర్వహించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వరల్డ్ క్రికెట్ కమిటీ సిఫారసుల నేపథ్యంలో సింగపూర్ భేటీపై ఆసక్తి నెలకొంది. అధ్యక్షుడిగా జై షా(Jai Shah) బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి వార్షిక సమావేశం ఇదే కావడం విశేషం.
ఈ మధ్యే జింబాబ్వేలోని హరారే వేదికగా ఐసీసీ కీలక సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు అందరూ వార్షిక సమావేశం వేదిక, తేదీలపై చర్చించారు. ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ అయిన ఇమ్రాన్ ఖవాజా ప్రతిపాదన మేరకు సింగపూర్‌లో క్రికెట్ పురోగతికి అవసరమైన తీర్మానాలు తీసుకోవాలని నిర్ణయించారు. సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని క్రికెట్ కమటీ సూచించిన మార్పులు, చేర్పులపై వార్షిక సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
Singapore to host ICC annual conference in July 3rd week; a working group to study new proposal for playing conditions. @JayShah @ICC @SGanguly99
Click here to view more : https://t.co/hO59ZFp20u— Vijay Tagore (@vijaymirror) April 18, 2025
ఐసీసీ వార్షిక సమావేశంలో ప్రధానంగా చర్చించే అంశాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. వన్డేల్లో రెండో బంతిని వినియోగించడాన్ని రద్దు చేయడం, టెస్టుల్లో టైమర్‌ను ప్రవేశ పెట్టడం, టీ20ల్లోనూ అండర్ -19 వరల్డ్ కప్ నిర్వహించడం వంటివి ముఖ్యమైనవి. వన్డేలు, టీ20ల్లో అమలు చేస్తున్న టైమర్ విధానం విజయవంతం కావడంతో సుదీర్ఘ ఫార్మాట్లోనూ ఈ పద్ధతిని తీసుకురావాలని ఐసీసీ భావిస్తోంది.
ఈ నిబంధన అమల్లోకి వస్తే పూర్తి అయిన 60 సెకన్లలో మరో ఓవర్ వేయాల్సి ఉంటుంది. దాంతో, ఒక్క రోజులో 90 ఓవర్లు పూర్తి చేయడం సాధ్యమవుతుంది. ఇక మూడోది.. వన్డే తరహాలోనే టీ20ల్లోనూ అండర్ -19 వరల్డ్ కప్ పోటీలు నిర్వహించడం. తద్వారా పొట్టి ఫార్మాట్‌కు విశేష ప్రచారం కల్పించాలనేది ఐసీసీ ఉద్దేశం.