Vinesh Phogat : గతంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్‌గా ఉన్న బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తనను కూడా లైంగికంగా వేధించాడని రెజ్లర్ వినేష్ ఫోగట్ అన్నారు. ఆయన వేధింపులు ఎదుర్కొన్న ఆరుగురిలో తాను కూడా ఒకరిని అని ఆమె వెల్లడించారు. ఈ మేరకు వినేష్ ఫోగట్ ఒక వీడియో విడుదల చేశారు. బ్రిజ్ భూషన్ వేధింపులకు గురైనట్లు వినేష్ ప్రకటించడం ఇదే మొదటిసారి.
గతంలో ఆయనపై ఆరోపణలున్నప్పటికీ, బాధితులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు. కానీ, ఇప్పుడు ఆమె తన వివరాల్ని బయటపెట్టింది. త్వరలో ఉత్తర ప్రదేశ్‌లోని గోండాలో అథ్లెట్లకు ర్యాంకింగ్ టోర్నమెంట్ జరగబోతుంది. చాలా కాలం తర్వాత వినేష్ ఆటలోకి అడుగుపెడుతోంది. అయితే, ఈ టోర్నీ జరిగేది బ్రిజ్ భూషణ్ ప్రభావిత ప్రాంతంలో. అది కూడా ఆయనకు చెందిన కాలేజీలోనే ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనతోపాటు అథ్లెట్ల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు వినేష్ ఫోగట్. తనకు, తన జట్టు సభ్యులకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె అన్నారు. చాలా కాలం తర్వాత ఆటలోకి అడుగుపెడుతున్న తన విషయంలో పక్షపాత అంపైరింగ్ కూడా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
🇮🇳🙏 pic.twitter.com/hQrGmMLMrS
— Vinesh Phogat (@Phogat_Vinesh) May 3, 2026
బ్రిజ్ భూషణ్ తన సన్నిహితుల ద్వారా తనపై కక్ష సాధింపులకు పాల్పడవచ్చని వినేష్ ఆరోపించారు. ఇక్కడ రెఫరీలు, చైర్మన్లు, పాయింట్లు అన్నింటినీ ఆయన ప్రభావితం చేయొచ్చన్నారు. తనకు ప్రత్యేకంగా ఎలాంటి గౌరవ, మర్యాదలు అక్కర్లేదని, కానీ, కష్టపడి వచ్చిన ప్రతి అథ్లెట్‌కు తగిన న్యాయం జరగాలని ఆమె కోరారు. త్వరలో జరగబోయే ఆసియన్ గేమ్స్‌కు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.