ముంబై: రోహిత్ శర్మకు తన మధ్య ఎటువంటి విభేదాలు లేవని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇవాళ ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడాడు. టెస్టు జట్టును ఎంపిక చేసుకోవడానికి కేవలం గంటన్నర ముందు మాత్రమే తనను బీసీసీఐ కాంటాక్ట్ చేసినట్లు కోహ్లీ చెప్పాడు. దక్షిణాఫ్రికా టూర్ చేస్తున్న ఇండియాకు రెండు రోజుల క్రితం జట్లను ప్రకటించారు. అయితే వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని బీసీసీఐ తప్పించింది. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లీ మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ పలు అంశాలను టచ్ చేశాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించే అంశంపై సెలెక్టర్లు కానీ, బీసీసీఐ కానీ తనతో సంప్రదించిందా అని విలేకురులు అడిగిన ప్రశ్నకు కోహ్లీ బదులు ఇచ్చాడు. టీ20 కెప్టెన్సీ వదులుకునే ముందు తాను బీసీసీఐకి చెప్పానని, తన వ్యూహాలను వారికి వెల్లడించానన్నారు. బీసీసీఐ దాన్ని స్వాగతించినట్లు కోహ్లీ తెలిపాడు. అయితే వన్డేలకు, టెస్టులకు కెప్టెన్‌గా కొనసాగేందుకు సిద్దంగా ఉన్నట్లు అప్పట్లో చెప్పినట్లు కోహ్లీ గుర్తు చేశాడు.
ఒకవేళ ఆఫీసు బియరర్లు లేదా సెలెక్టర్లు తనకు కెప్టెన్సీ అప్పగించడానికి అనుకూలంగా లేకున్నా.. దానికి కూడా తాను సిద్ధమే అని చెప్పినట్లు కోహ్లీ తెలిపాడు. తానెప్పుడూ సెలెక్షన్‌కు అందుబాటులో ఉన్నట్లు చెప్పాడు. వన్డేలకు అందుబాటులో ఉంటానని, ఆడేందుకు కూడా ఇష్టంగా ఉన్నట్లు కోహ్లీ స్పష్టం చేశాడు. వన్డేలకు కెప్టెన్‌గా కొనసాగరాదు అని అయిదుగురు సెలెక్టర్లు నిర్ణయించినట్లు కోహ్లీ తెలిపాడు. సౌతాఫ్రికా టూర్లో జరిగే వన్డేలకు తానేమీ రెస్ట్ కోరలేదని, తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని కోహ్లీ అన్నాడు.