Umesh Yadav | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) ఎడిషన్‌కు సంబంధించిన మెగా వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేలంలో ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడి మరీ కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయి. అయితే, టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ (Umesh Yadav)ను కొనుగోలు చేసేందుకు మాత్రం ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో సీనియర్ ఆవేదన వ్యక్తం చేశాడు. వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేయకపోవడంతో తాను చాలా బాధపడ్డానని.. నిరాశ చెందానని ఉమేష్ పేర్కొన్నాడు. ఉమేష్ ఐపీఎల్లో ఇప్పటి వరకు నాలుగు జట్ల తరఫున బరిలోకి దిగాడు. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. కోల్‌కతా నైట్ రైడర్జ్, గుజరాత్ టైటన్స్ తరఫున ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.
Read Also : Rishabh Pant | లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్.. ప్రకటించిన సంజీవ్ గొయెంకా
అయితే, స్పోర్ట్స్ ఛానెల్‌తో ఉమేశ్ మాట్లాడుతూ ఐపీఎల్లో తాను 15 సంవత్సరాలుగా ఆడుతున్నానని తెలిపాడు. ఈ ఐపీఎల్ తనకు చాలా షాకింగ్ ఉందని చెప్పాడు. తాను ఎందుకు అబద్ధం చెప్పాలని.. ఈ విషయంలో తనకు బాధగా ఉందని పేర్కొన్నాడు. దాదాపు 150 ఐపీఎల్ మ్యాచులు ఆడిన తర్వాత జట్టులో స్థానం లభించకపోతే ఏ ఆటగాడికైనా షాకింగ్‌గా ఉంటుందని చెప్పాడు. అయితే, అది ఫ్రాంచైజీ, వారి వ్యూహాలపై ఆధారపడి ఉంటుందన్న ఉమేష్.. వేలంలో తన పేరు ఆలస్యంగా రావడం.. డబ్బు లేకపోవడం వల్ల ఏదో విధంగా తాను ఐపీఎల్‌కు దూరమయ్యాయని చెప్పాడు.
Read Also : Rohit Sharma | చాంపియన్స్ ట్రోఫీ గెలిచి వస్తే.. 140 కోట్ల మంది స్వాగతిస్తారు : రోహిత్ శర్మ
తాను చాలా నిరాశ, కలత చెందానన్న ఉమేష్.. ఎవరి నిర్ణయాన్ని మార్చలేనని వాపోయాడు. ఉమేష్ యాదవ్ ఐపీఎల్లో గత 15 సీజన్స్‌లో పాల్గొన్నాడు. ఇందులో 148 మ్యాచులు ఆడిన ఫాస్ట్ బౌలర్ 144 వికెట్లు పడగొట్టాడు. ఇక రిటైర్మెంట్పై స్పందిస్తూ.. తాను 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయలేనప్పుడు రిటైర్ అవుతానని ప్రకటించాడు. అప్పటి వరకు బౌలింగ్ చేస్తుంటానని.. ఈ విషయం ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని తెలిపాడు. ఉమేష్ టీమిండియా తరఫున 57 టెస్టులు, 75 వన్డేలు, 9 టీ20 ఆడాడు. టెస్టుల్లో 170 వికెట్లు, వన్డేల్లో 106, టీ20ల్లో 12 వికెట్లు తీశాడు. ఇక ఉమేష్ యాదవ్ జూన్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడాడు.