నానాటికీ తన విలువను పెంచుకుంటూ పోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఇటీవలే ముగిసిన మీడియా రైట్స్ ద్వారా ఏకంగా రూ. 48,390 కోట్లను ఆర్జించింది. అయితే ఇది ట్రైలరేనని.. తర్వాత సైకిల్ (2027-31) లో మీడియా హక్కుల ద్వారా ఐపీఎల్ లక్ష కోట్ల రూపాయలు ఆర్జించడం ఖాయమని ఈ లీగ్ సృష్టికర్త లలిత్ మోడీ కుండబద్దలు కొట్టాడు.
2023-27 కాలానికి గాను మీడియా రైట్స్ ద్వారా బీసీసీఐ భారీగా ఆర్జించిన నేపథ్యంలో లలిత్ మోడీ స్పందించాడు. తాజాగా ఓ జాతీయ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ విలువ నానాటికీ పెరుగుతున్నది. 2008 నుంచి మీరు నా ఇంటర్వ్యూలు చూస్తే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఐపీఎల్ మీడియా హక్కుల విలువ డబుల్ అవుతుందని నేనెప్పుడో చెప్పా. గత సైకిల్ కంటే ఈసారి (2023-27 కాలానికి)కి అది 98 శాతం పెరిగింది. ఇక ఆ తర్వాత రాబోయే సైకిల్ కు దాని విలువ డబుల్ (లక్ష కోట్లు) అవుతుంది..’ అని అన్నాడు.
ఐపీఎల్ విలువ పెరుగుతుందని చెబితే అందరూ తనను చూసి నవ్వారని.. ఇప్పుడు వాళ్లే ముక్కున వేలేసుకుంటున్నారని మోడీ చెప్పాడు. ‘నేను గతం నుంచీ చెబుతూనే ఉన్నా. కానీ ఎవరూ నా మాట వినలేదు. అందరూ నన్ను చూసి నవ్వారు. అయినా నేను దాన్ని పట్టించుకోను.
అయితే ఐపీఎల్ కు కొత్త అభిమానులు వస్తున్నారు. వాళ్లను ఎంగేజ్ చేయడంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడొచ్చే యువత చాలా మట్టుకు డిజిటల్ (ఆన్లైన్) ద్వారానే మ్యాచులను వీక్షిస్తున్నది. అందుకే ఈసారి డిజిటల్ హక్కులకు భారీగా డిమాండ్ ఏర్పడింది..’ అని తెలిపాడు. వచ్చే సైకిల్ వరకు ఐపీఎల్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్పోర్ట్స్ లీగ్ గా అవతరించనుందని మోడీ అంచనా వేశాడు.
2008లో ఐపీఎల్ ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించిన లలిత్ మోడీ.. 2010 వరకు ఈ లీగ్ కు చైర్మన్ గా వ్యవహరించాడు. అయితే 2005-2010 మధ్య బీసీసీఐకి ఉపాధ్యక్షుడిగా ఉన్న కాలంలో అతడు అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో 2013 లో బీసీసీఐ అతడిపై జీవితకాల నిషేధం విధించింది. ప్రస్తుతం అతడు లండన్ లో జీవిస్తున్నాడు.