హైదరాబాద్, ఆట ప్రతినిధి : చెన్నై వేదికగా జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్ రెగెట్టాలో హైదరాబాద్కు చెందిన యువ సెయిలర్లు సత్తాచాటారు. 7 దేశాల నుంచి 48 మంది అగ్రశ్రేణి సెయిలర్లు పాల్గొన్న ఈ పోటీలో మన సెయిలర్లు.. ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం గెలుచుకున్నారు.
ఒక అంతర్జాతీయ పోటీలో హైదరాబాద్ సెయిలర్లు 4 పతకాలు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పోటీల్లో 14 ఏండ్ల రవికుమార్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. సముద్రంలో 2 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న అలలను గంటకు 15-20 నాట్ల వేగంతో వీస్తున్న గాలులను లెక్కచేయకుండా అండర్-15 విభాగంలో కాంస్యం సొంతం చేసుకున్నాడు.