హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన సునీల్ రాబర్ట్ వుప్పుల మారథాన్‌లో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోని మొత్తం ఏడు ఖండాలలో జరిగిన మారథాన్ పోటీలలో పాల్గొని అరుదైన రికార్డు సృష్టించారు. ఇప్పటివరకూ ఈ ఘనత సాధించిన 900 మంది అథ్లెట్లలో ఆయన ఒకరిగా నిలిచారు. ఆయన పాల్గొన్న చివరి మారథాన్ ఇటీవల దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నగరంలో ముగిసింది. దాదాపు 15 ఏండ్ల పాటు వివిధ ఖండాలలో భిన్న వాతావరణ పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొంటూ ఆయన మారథాన్లలో పాల్గొన్నారు. న్యూయార్క్ నగరంలో 2011లో సునీల్ తొలిసారి మారథాన్‌లో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీజే, ఎంబీఏ కోర్సులను అభ్యసించిన 57 ఏండ్ల సునీల్ టీసీఎస్, ఒరాకిల్, టీసీఎస్ వంటి బహుళజాతి కంపెనీలలో పనిచేశారు. ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన ఆయన వివిధ కంపెనీలకు కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.