కైరో: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ మూడో పతకం గెలిచింది. శుక్రవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 20 ఏండ్ల ఇషా.. 30 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలవడంతో కాంస్యం సొంతమైంది. క్వాలిఫికేషన్ రౌండ్లో 294 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన ఇషా.. కీలక ఫైనల్లోనూ ఏకాగ్రత చెదరకుండా గురిని లక్ష్యం వైపు నిలిపి ఈ టోర్నీలో మూడో పతకాన్ని కైవసం చేసుకుంది.
కొరియా షూటర్ జిన్ యాంగ్ (40 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా చైనాకు చెందిన క్వియాంజిన్ యావొ (38) రజతం సాధించింది. ఈ విభాగం ఫైనల్లో నిలిచిన మరో భారత షూటర్ మనూ బాకర్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. ఆమె 23 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.