రాజ్‌కోట్: విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా నాలుగు ఓటములు ఎదుర్కొన్న హైదరాబాద్ శనివారం చండీగఢ్‌తో జరిగిన పోరులో 136 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత స్టార్ బ్యాటర్ తిలక్‌వర్మ(117 బంతుల్లో 109, 6ఫోర్లు, 3సిక్స్‌లు) సెంచరీతో హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 286/9 స్కోరు చేసింది. తిలక్‌కు తోడు అభిరాత్రెడ్డి(71) రాణించడంతో హైదరాబాద్ సాధికారిక స్కోరు అందుకుంది.
టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న తిలక్ తనదైన శైలిలో జట్టును ముందుండి నడిపించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చండీగఢ్ 37.4 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. సన్యమ్ సైనీ(46) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. రక్షణ్‌రెడ్డి మూడు వికెట్లతో విజృంభించగా, నితేశ్‌రెడ్డి, సీవీ మిలింద్ రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 6న బెంగాల్‌తో హైదరాబాద్ తలపడనుంది.