హైదరాబాద్, ఆట ప్రతినిధి: బీసీసీఐ అండర్-23 వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ అదిరిపోయే బోణీ కొట్టింది. బుధవారం చత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చత్తీస్‌గఢ్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 42.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. స్టార్ బ్యాటర్ గొంగడి త్రిష(124 బంతుల్లో 101 నాటౌట్, 9ఫోర్లు, 2సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కింది.
తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ జట్టు విజయంలో కీలకమైంది. చత్తీస్‌గఢ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ త్రిష తన ఇన్నింగ్స్‌లో 9ఫోర్లు, 2సిక్స్‌లతో దుమ్మురేపింది. శివానీ యాదవ్(2/30)రెండు వికెట్లు తీసింది. తొలుత చత్తీస్‌గఢ్ 50 ఓవర్లలో 187/8 స్కోరు చేసింది. ఓపెనర్ యేషా భారతి(89) అర్ధసెంచరీతో రాణించింది. త్రిషా పూజిత(3/10), త్రిష(2/38), జాజ్‌మైన్(2/23) ఆకట్టుకున్నారు.