IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో బోణీ కొట్టాలనే కసితో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)కు షాకింగ్ న్యూస్. స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ(Wanindu Hasaranga) రాక మరింత ఆలస్యం కానుంది. ఎడమ కాలిమడిమ నొప్పి తగ్గకపోవడంతో అతడికి శ్రీలంక క్రికెట్ (Srilanka Cricket) ఐపీఎల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం స్వదేశంలోనే ఉన్న హసరంగ త్వరలోనే విదేశీ డాక్టర్లను సంప్రదించనున్నాడు.
ఆ తర్వాతే ఈ మిస్టరీ స్పిన్నర్ ఐపీఎల్ ఎంట్రీపై సందిగ్దత వీడే అవకాశముంది. చూస్తుంటే.. మరో వారం రోజులు అతడు ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. మార్చి 31న గుజరాత్ టైటాన్స్, ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో జరిగే మ్యాచ్‌లకు హసరంగా అందుబాటులో ఉండకపోవచ్చు.
బంగ్లాదేశ్ సిరీస్‌లో దురుసు ప్రవర్తనతో హసరంగ వేటుకు గురయ్యాడు. అంపైర్‌ను దుర్భాషలాడినందుకు అతడిపై ఐసీసీ రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. అయితే.. హసరంగ తెలివిగా టెస్టు క్రికెట్ వీడ్కోలును వెనక్కి తీసుకొన్నాడు. దాంతో, బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లకు ఎంపికైన అతడిని చివరకు పక్కన పెట్టేశారు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్నందును ఐసీసీ నిషేధాన్ని హసరంగా ఇలా తప్పించుకున్నాడు. నిరుడు ఐపీఎల్ 16వ సీజన్లో ఈ స్టార్ స్పిన్నర్ అదరగొట్టాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున 26 వికెట్లు పడగొట్టాడు. అయితే.. మినీ వేలానికి ముందు ఆర్సీబీ హసరంగను వదిలేసింది. దాంతో, వేలంలో హైదరాబాద్ రూ.1.5 కోట్లకు అతడిని కొన్నది.