హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్(హెచ్పీఎల్)కు వేళయైంది. సెంటర్ కోర్ట్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌ను రూపొందించింది. అక్టోబర్ 10వ తేదీన ప్రారంభమై..ప్రతీ శుక్రవారం అభిమానులను అలరించనుంది. ఐపీఎల్ తరహాలో ఫ్రాంచైజీల వారీగా జరుగనున్న లీగ్ కోసం ఈనెల 20న ప్లేయర్ల వేలం జరుగనుంది.
గ్రామీణ ప్లేయర్లకు కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నత స్థాయి వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో లీగ్‌కు రూపకల్పన చేశారు. మొత్తం 12 లక్షల ప్రైజ్‌మనీతో జరుగనున్న లీగ్‌లో ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి. ఒక్కో జట్టులో 10 మంది ప్లేయర్లు ఉంటారు. ప్రతీ జట్టుకు ఒక ఐకాన్ ప్లేయర్ కెప్టెన్సీ వహిస్తాడు. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగనున్న టోర్నీలో మ్యాచ్‌లు ఎనిమిది వేదికల్లో జరుగుతాయి.