హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తర్వాత హైదరాబాద్ నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే బౌలర్ ఎవరు? అన్న వినూత్న కాన్సెప్ట్‌తో బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్.. ఓల్డ్ సిటీలో టాలెంట్ హంట్‌కు శ్రీకారం చుట్టారు. బుధవారం ఆరాంఘర్‌లోని విజయానంద్ గ్రౌండ్స్‌లో ‘మన తదుపరి సిరాజ్ ఎవరు?’ (హూ ఈజ్ అవర్ నెక్స్ సిరాజ్) అన్న ట్యాగ్‌లైన్‌తో ఓల్డ్ సిటీకి చెందిన నిరుపేద క్రికెటర్ల కోసం ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ఈ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది.
సుమారు 400 మంది ఔత్సాహిక క్రికెటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పేసర్ సిరాజ్, టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ ముజీబ్ హాజరయ్యారు. ఈ ట్రయల్స్‌ను యువ క్రికెటర్లు సద్వినియోగం చేసుకోవాలని ఒవైసీ పిలుపునిచ్చారు. సిరాజ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ఔత్సాహిక క్రికెటర్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించాడు.
ఈ సందర్భంగా సిరాజ్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కున్న కష్టాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ఎంఎస్కే మాట్లాడుతూ.. పాతబస్తీలో ప్రతిభావంతులైన, పేద పిల్లలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు నిస్వార్థంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.