దుబాయ్: మరికొద్దిరోజుల్లో భారత్, శ్రీలంక వేదికలుగా మొదలుకాబోయే మహిళల వన్డే ప్రపంచకప్ ముందు మహిళా క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుభవార్త చెప్పింది. వన్డే ప్రపంచకప్ ఈవెంట్‌కు మునుపెన్నడూ లేని విధంగా, పురుషుల క్రికెట్ కంటే ఎక్కువగా ప్రైజ్‌మనీని పెంచి అమ్మాయిలపై కాసుల వర్షం కురిపించనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 02 వరకు 8 జట్లు పాల్గొనబోయే వన్డే ప్రపంచకప్ కోసం 13.88 యూఎస్ మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 122.5 కోట్లు) నగదు బహుమతిని ప్రకటించింది.
న్యూజిలాండ్‌లో జరిగిన 2022 ఎడిషన్‌తో (రూ. 31 కోట్లు) పోల్చితే ఇది సుమారు నాలుగింతలు అధికం. ఈ మెగా ఈవెంట్లో విజేతగా నిలిచే జట్టుకు రూ. 39.55 కోట్లు (4.48 మిలియన్ యూఎస్ డాలర్లు) అందనుంది. గత ఎడిషన్‌లో టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియాకు రూ. 11.65 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. దానితో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువ కావడం విశేషం. 2025 ఎడిషన్‌లో రన్నరప్‌నకు రూ. 19.77 కోట్లు (2022లో రూ. 5.30 కోట్లు) దక్కనుంది.
భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ప్రైజ్‌మనీ (రూ. 88.26 కోట్లు) కంటే తాజా పెంపు అధికం. అప్పుడు ఫైనల్లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా జట్టుకు దక్కిన మొత్తం (రూ. 35 కోట్లు) కంటే ఇప్పుడు మహిళల వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టుకు (రూ. 40 కోట్లు) మరో రూ. 5 కోట్లు అదనంగా దక్కనుంది.
ఇక ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో సెమీస్ చేరిన జట్లకు రూ. 9.89 కోట్లు (గత ఎడిషన్‌లో రూ. 2.65 కోట్లు) అందజేయనుండగా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచే జట్లకు రూ. 4.50 కోట్లు అందనుంది. 7,8 స్థానాల్లో నిలిచే జట్లకు రూ. 2. 2 కోట్లు ఇవ్వనుండగా ప్రపంచకప్‌లో పాల్గొన్న ప్రతి జట్టుకూ అదనంగా రూ. 2 కోట్లు దక్కుతాయి. మహిళల క్రికెట్‌కు ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీసీ తెలిపింది.