సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో పలువురు తొలి రౌండ్ విఘ్నాన్ని విజయవంతంగా దాటారు. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్-సిక్కిరెడ్డి ద్వయం 21-17, 21-19తో లిమ్-వొంగ్ (మలేషియా) ను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. పురుషుల తొలి రౌండ్లో హెచ్ఎస్ ప్రణయ్ 21-10, 23-21 తో కొలెహొ డి ఒలివిర (బ్రెజిల్)ను ఓడించగా కిరణ్ జార్జి 21-17, 21-10తో జియడొంగ్ (కెనడా)ను చిత్తు చేసి రెండో రౌండ్‌కు చేరారు.
సమీర్ వర్మ 21-10, 21-10తో (ఆస్ట్రేలియా)ను మట్టికరిపించాడు. మంజునాథ్, రవి, సుబ్రహ్మణ్యన్, అభిషేక్ ఓటమిపాలయ్యారు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 21-10, 21-8తో భారత్‌కే చెందిన మొపటిని ఓడించగా ఆకర్షి కశ్యప్ 21-14, 21-11తో పొలిన బురొవ (ఉక్రెయిన్)ను చిత్తుచేసింది. అనుపమ ఉపాధ్యాయ 21-14, 23-21తో వాంగ్ లియాంగ్ (మలేషియా)ను ఓడించింది.