CWC 2023 | వన్డే వరల్డ్ కప్ -2023లో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన జట్టు ఇంగ్లండ్ అయితే ఈ మెగా టోర్నీకి ముందు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కొన్నాళ్లపాటు అగ్రస్థానం దక్కించుకుని బరిలోకి దిగిన జట్టు పాకిస్తాన్. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఈ రెండూ కచ్చితంగా సెమీస్ చేరే రేసులో ఉన్న జట్లే. కానీ ఎప్పుడెలా ఆడతారో తెలియని పాకిస్తాన్.. బజ్‌బాల్ మాయలో కొట్టుకుపోతున్న ఇంగ్లండ్‌లు ప్రస్తుతం సెమీస్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది. అత్యంత చెత్త ఆటతీరుతో తమతో పోల్చితే ఎన్నో రెట్లు చిన్నవైన జట్ల చేతిలో ఓడిపోతూ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటున్నాయి. మరో మ్యాచ్‌లో ఓడితే గనక గతేడాది టీ20 వరల్డ్ కప్ ఫైనలిస్టులు అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే…!
ఇంగ్లండ్ కథ
ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన జట్టు ఇంగ్లండ్. జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లీష్ జట్లు వరల్డ్ క్లాస్ బ్యాటర్లు, వైవిధ్యమైన బౌలర్లు, స్టార్ ఆల్ రౌండర్లతో కళకళలాడుతోంది. కానీ అన్నీ ఉండీ ఇంగ్లండ్ తడబడుతోంది. తొలిమ్యాచ్‌లోనే కివీస్ చేతిలో దారుణ పరాజయం పాలైన బట్లర్ గ్యాంగ్.. బంగ్లాదేశ్‌ను ఓడించింది. కానీ తర్వాత ఆడిన అఫ్గానిస్తాన్ మ్యాచ్ ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పాతాళానికి తొక్కేసింది. ఆ మ్యాచ్ ఫలితం సౌతాఫ్రికా మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. సఫారీలతో ఓడిన తర్వాత ఇంగ్లండ్.. పాయింట్ల పట్టికలో చిట్టచివరిస్థానంలో ఉంది.
సెమీస్‌కు చేరేనా..?
సెమీస్‌కు అర్హత సాధించాలంటే ఇంగ్లండ్ తర్వాత ఆడబోయే ఐదు మ్యాచ్‌లలో ప్రతిదాంట్లోనూ నెగ్గాలి. ప్రతి మ్యాచ్ గెలిచినా ఆ జట్టు టాప్-4లోకి వస్తుందా..? అన్నదీ అనుమానమే. ఈ ఐదు మ్యాచ్‌లలో బట్లర్ గ్యాంగ్ భారీ తేడాలతో గెలిచి నెట్ రన్ రేట్‌ను పెంచుకోవాలి. ప్రస్తుతం ఇంగ్లండ్.. -1.248 నెట్ రన్ రేట్ కలిగిఉంది. ఇంగ్లండ్ ఈనెల 26న శ్రీలంకతో ఆడనుండగా వచ్చే ఆదివారం భారత్‌తో ఆడాల్సిఉంది. ఇంగ్లండ్ ఇంకా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్‌ను ఢీకొనాల్సి ఉంది. ఈ ఐదింటిలో ఏ ఒక్కదాంట్లో ఓడినా డిఫెండింగ్ ఛాంపియన్స్ కథ కంచికే..
పాకిస్తాన్దీ అదే పరిస్థితి..
ఇంగ్లీష్ జట్టుతో పాటు పాకిస్తాన్ కథ కూడా ఇంచుమించుగా అదే విధంగా ఉంది. సోమవారం అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఓడిన తర్వాత బాబర్ ఆజమ్ అండ్ కో. కథ దాదాపుగా ముగిసినట్టే కనిపిస్తోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు ఓడిన పాక్.. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తదుపరి నాలుగుమ్యాచ్లలో గెలివాలి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న పాక్.. తమ తదుపరి మ్యాచ్‌లలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి పటిష్టమైన జట్లతో పాటు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ నాలుగింటిలో గెలిచినా బాబర్ సేన సెమీస్ చేరడం కష్టమే. ప్రస్తుతం టాప్ -4 ఉన్న జట్లు (ఇండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా) ఇదే ఊపును కంటిన్యూ చేస్తే అప్పుడు పాక్‌కు తిప్పలు తప్పవు.