Paris Olympics | నాలుగేండ్లకోసారి ప్రపంచ క్రీడాభిమానులను అలరించే ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో పతకమనేది ఒక ప్లేయర్ జీవిత లక్ష్యం! విశ్వక్రీడా వేదికపై కనీసం ఒక్కసారైనా పతకాన్ని ముద్దాడాలనే నేపథ్యం. అందుకోసం ప్లేయర్లు పడని కష్టమంటూ ఉండదు. అయినవారి అందరికీ దూరంగా రోజులకు రోజులు పగలు, రాత్రి అన్న తేడా లేకుండా నిరంతరం శ్రమిస్తుంటారు. ఒకే ఒక్క ఆలోచనతో లక్ష్యంగా ముందుకు సాగుతుంటారు.
పతకం సాధించిన సమయంలో తాము ఇన్ని రోజులు పడిన ప్రయాసను మరిచి విజయాన్ని ఆస్వాదిస్తుంటారు. ప్రపంచమంతా ఒకచోట పోటీపడే ఒలింపిక్స్‌లో పతక సాధనకు ప్రతిభ ఒక్కటే గీటురాయి కాదు. విశ్వక్రీడల్లో పోటీ అంటేనే అత్యుత్తమ నైపుణ్యమున్న ప్లేయర్లు బరిలో ఉంటారు. ప్రతిభకు అదృష్టం తోడైతేనే పతకం మన చెంతకు చేరుతుంది. లేకపోతే మరో నాలుగేండ్లు నిరీక్షణ తప్పదు.
ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్లేయర్లు నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో చేజార్చుకున్న పతకాలు ఏడు. ఇందులో ఒకరిది 100 గ్రామలు తేడా అయితే ఉంకొకరిది 1కిలో వ్యత్యాసం, ఒక పాయింట్ తేడా ఇలా పతకాలు కోల్పోయిన వారే. వీరి ప్రదర్శనకు అదృష్టం కూడా కలిసి వచ్చేదుంటే భారత్ ఖాతాలో మరో ఏడు పతకాలు చేరేవి. పారిస్‌లో భారత్ చేజార్చుకున్న పతకాలపై ప్రత్యేక కథనం.
– (నమస్తే తెలంగాణ, క్రీడా విభాగం)
దురదృష్టమంటే భారత స్టార్ వినేశ్ ఫోగాట్‌దే. పోరాటాన్ని అణువణున నింపుకున్న ఈ హర్యానా మల్లయోధురాలికి పారిస్ ఒలింపిక్స్ అస్సలు కలిసి రాలేదు. రియో(2016), టోక్యో(2020) విశ్వక్రీడల్లో ఎదురైన అనుభవం లాగే పారిస్‌లో వినేశ్‌ను 100 గ్రాముల తేడా అనర్హతకు గురయ్యేలా చేసింది. తన రెగ్యులర్ విభాగానికి భిన్నంగా ఈసారి 50కిలోల కేటగిరీని ఎంచుకున్న వినేశ్..తొలి పోరులోనే జపాన్ దిగ్గజ రెజ్లర్ యుయి సుసాకిని చిత్తు చేసి సంచలనం సృష్టించింది. వరుస బౌట్లలో ప్రత్యర్థులను ఓడిస్తూ ఫైనల్ చేరిన తొలి భారత రెజ్లర్‌గా రికార్డుల్లో కెక్కింది. కానీ మరునాటి ఉదయమే బరువు రూపంలో ఆమె పతక ఆశలు కలలయ్యాయి. నిద్ర, ఆహారం మానేసి ఆఖరికి జుట్టు కత్తిరించుకున్నా..లాభం లేకపోయింది. అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానంలో తీర్పు ఎలా వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
అసలు అంచనాలు లేకుండా పోటీకి దిగిన యువ షూటర్లు మహేశ్వరి చౌహాన్, అనంత్‌జీత్‌సింగ్ నరుక అద్భుత ప్రదర్శనతో నాలుగో స్థానంతో ఆకట్టుకున్నారు. స్కీట్ మిక్స్‌డ్‌టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో అనంత్, మహేశ్వరి జోడీ 43-44తో చైనా ద్వయం యిటింగ్ జియాంగ్, లు జియాన్లిన్ చేతిలో ఓడింది. పాయింట్ తేడాతో భారత షూటర్లు కాంస్యం సాధించే చాన్స్ కోల్పోయారు.
టోక్యో(2020) ఒలింపిక్స్‌లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయిచాను..పారిస్‌లో ఆ ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయింది. మహిళల 49కిలోల కేటగిరీలో పోటీకి దిగిన మీర 199కిలోలు ఎత్తి నాలుగో స్థానంతో కాంస్యం చేజార్చుకుంది. థాయ్‌లాండ్ లిఫ్టర్ సురోచన కాంబవో(200కి) కేజీ తేడాతో కంచు ఖాతాలో వేసుకుంది. తన చివరి లిఫ్టింగ్‌లో విఫలం కావడం మీరాబాయి పతక అవకాశాలను దెబ్బతీసింది.
ఆర్చరీలో భారత ద్వయం బొమ్మదేవర ధీరజ్, అంకిత భకత్కు నిరాశే ఎదురైంది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సెమీస్‌కు చేరిన తొలి భారత జోడీగా నిలిచిన ధీరజ్, అంకితకు కాంస్య పతక పోరులో తలపడే అవకాశం లభించింది. అయితే అమెరికా ద్వయం బ్రాడీ ఎలీసన్, క్యాసీ కౌఫ్ఫోల్డ్ చేతిలో 6-2తో ఓడటంతో కాంస్యం చేజారింది.
ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది కొత్తేం కాదు. దిగ్గజ అథ్లెట్లు మిల్కాసింగ్, పీటీ ఉష, సానియా మీర్జా నాలుగో స్థానంతో ఒలింపిక్ పతకాలను దక్కించుకోలేకపోయారు. మొత్తంగా పారిస్ విశ్వక్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచిన మనవాళ్లు మూడులో ఉండుంటే భారత్ ఖాతాలో మరో ఏడు పతకాలు చేరేవి. వచ్చే లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లోనైనా పతకాల్లో భారత్ డబుల్ డిజిట్ మార్క్ అందుకుంటుందని ఆశిద్దాం.
పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత యువ షూటర్ అర్జున్ బబుత 1.4 పాయింట్ తేడాతో పతక అవకాశాన్ని కోల్పోయాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో అర్జున్ 208.4 పాయింట్లు చేస్తే.. క్రొయేషియా షూటర్ మిలాన్ మారిసిచ్ 209.8 పాయింట్లతో కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఒలింపిక్స్‌లోనే పతకం సాధిద్దామనుకున్న అర్జున్ ఆశలు నాలుగుతో నీరుగారిపోయాయి.
బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన యువ షట్లర్ లక్ష్యసేన్ అద్భు త అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అంచనాలకు మించి రాణిస్తూ టోర్నీలో ఆది నుంచే తనకంటే మెరుగైన ర్యాంకింగ్ ఉన్న ప్లేయర్లను ఓడించిన లక్ష్యసేన్..కాంస్య పోరులో తడబడ్డాడు. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-13, 16-21, 11-21తో లీ జీ జియా(మలేషియా) చేతిలో ఓడాడు. తొలి గేమ్ గెలిచి జోరు మీద కనిపించిన ఈ 22 ఏండ్ల షట్లర్..ఒత్తిడికిలోనై వరుసగా రెండు గేమ్‌లు చేజార్చుకున్నాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో వేర్వేరు ఈ వెంట్లలో కాంస్య పతకాలు కొల్లగొట్టిన స్టార్ షూటర్ మను భాకర్.. కొద్దిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. 25మీ టర్ల పిస్టల్ పోరులో భాకర్.. హంగరీ షూటర్ వెరోనిక మేజర్‌తో వర్గీకరణ షూట్ లో వెనుకంజతో నాలు గో స్థానంలో నిలిచిం ది. భాకర్ హ్యాట్రిక్ మెడల్ సాధించే చాన్స్ కోల్పోయింది.
భారత యువ రెజ్లర్ రితికా హుడా పోరాడి ఓడింది. బరిలోకి దిగిన తొలిసారే మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం జరిగిన మహిళల 76కిలోల క్వార్టర్స్ బౌట్లో రితిక 1-1(టై బ్రేక్)తో ఐపెరీ మెడెట్ కైజీ(కిర్గిస్థాన్) చేతిలో ఓటమిపాలైంది. వాస్తవానికి ఇద్దరు రెజ్లర్లు బౌట్ ముగిసే సరికి 1-1తో సమంగా ఉన్నా..ఆఖరి పాయింట్‌ను పరిగణనలోకి తీసుకుంటూ కిర్గిస్థాన్ రెజ్లర్‌ను విజేతగా ప్రకటించడంతో రితికకు నిరాశ ఎదురైంది. దీంతో పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో భారత పోరాటం ముగిసింది.