చెన్నై: ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య భారత్ గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఓటమన్నదే ఎరుగకుండా ప్రత్యర్థులను చిత్తుచేస్తూ టీమ్ఇండియా ముందుకెళుతున్నది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2తో దక్షిణకొరియాపై అద్భుత విజయం సాధించింది. దీంతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక డ్రాతో ప్రస్తుతం భారత్ 10 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
మ్యాచ్ విషయానికొస్తే..కొరియాతో పోరులో టీమ్ఇండియా ఆది నుంచే తమదైన దూకుడు ప్రదర్శించింది. మ్యాచ్ మొదలైన ఆరో నిమిషంలోనే నీలకంఠశర్మ గోల్‌తో భారత్ 1-0 ఆధిక్యం దక్కించుకుంది. కిమ్ సుంగ్యాన్(12ని) కొరియాకు తొలి గోల్ అందించాడు. హర్మన్‌ప్రీత్‌సింగ్(23ని), మన్‌దీప్‌సింగ్(33ని) జట్టుకు గోల్స్ అందించారు. మ్యాచ్ రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా యాంగ్ జిహున్ గోల్‌తో కొరియా రెండో గోల్ ఖాతాలో వేసుకుంది. బుధవారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడుతుంది.