టోక్యో: ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ టోర్నీకి వేళయైంది. శనివారం నుంచి మెగాటోర్నీకి తెరలేవనుంది. భారత్ తరఫున స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్నాడు. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ అయిన నీరజ్ రెండోసారి స్వర్ణం సాధించడం ద్వారా అరుదైన ఘనత సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.
2023(బుడాపెస్ట్)లో తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నీలో పసిడి సాధించిన నీరజ్..మరోమారు అదే ఫీట్ పునరావృతం చేయాలని చూస్తున్నాడు. తద్వారా దిగ్గజ జావెలిన్‌త్రోయర్, ప్రస్తుత తన కోచ్ జాన్ జెలెంజీ, అండర్సన్ పీటర్సన్ సరసన నిలువాలని చోప్రా ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇదిలా ఉంటే పారిస్(20204) ఒలింపిక్స్ పసిడి విజేత అర్షద్ నదీమ్‌తో తొలిసారి చోప్రా పోటీపడుతున్నాడు.
నదీమ్‌కు తోడు మరోవైపు జులియన్ వెబర్, అండర్సన్ పీటర్స్, జాకబ్ వాల్దిచ్, జులియస్ యెగో, కేశార్న్ వాల్కట్ నుంచి నీరజ్‌కు పోటీ ఎదురుకానుంది.మరోవైపు ఈ మెగాటోర్నీలో భారత్ 19 మంది అథ్లెట్లతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అన్నురాణి(జావెలిన్‌త్రో), పారుల్ చౌదరీ(3000మీ స్టిపుల్చేజ్), మురళీ శ్రీశంకర్(లాంగ్‌జంప్), గుల్వీర్సింగ్(5000మీ), ప్రవీణ్ చిత్రవేల్(ట్రిపుల్ జంప్) పోటీలో ఉన్నారు.