Commonwealth Games 2026 : పారిస్ ఒలింపిక్స్‌లో కంచు మోతతో చరిత్ర సృష్టించిన భారత హాకీ వీరులకు షాకింగ్ న్యూస్. గ్లాస్గో వేదికగా 2026లో జరుగబోయే ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games 2026)లో హాకీ ఆటపై వేటు పడనుంది. హాకీ పోటీల నిర్వహణ ఖర్చుతో కూడిందని, అందుకని మెగా టోర్నీ నుంచి ఈ ఆటను తప్పించాలని గ్లాస్గో అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
అయితే.. హాకీ పోటీలకు చెక్ పెడుతున్నారా? అనే ప్రశ్నపై అంతర్జాతీయ హాకీ సమాఖ్య(FIH)గానీ, కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (CGF)గానీ నోరు మెదపడం లేదు. చూస్తుంటే.. నిజంగానే హాకీని విస్మరించాలనే ఆలోచనతో నిర్వాహకులు ఉన్నట్టు అనిపిస్తోంది. ‘కామన్వెల్త్ గేమ్స్‌లో హాకీ ఉంటుందా? ఉండదా? అనే సందిగ్ధానికి త్వరలోనే తెర పడనుంది. రెండు మూడు రోజుల్లో ఏదో ఒక నిర్ణయాన్ని మీకు తప్పకుండా తెలియజేస్తాం.
HEARTBREAKING NEWS FOR INDIAN SPORTS LOVER.
Field hockey will not be played in 2026 Commonwealth Games, OFFICIAL announcement most probably to be made today.
PS: India won the Bronze medal in Paris Olympic this year. pic.twitter.com/eCeeMDVexU
— Parav Sharma (@ParavSharma23) October 21, 2024
మా వరకైతే కామన్వెల్త్ క్రీడల సమాఖ్య నుంచి ఎటువంటి సమాచారం లేదు. అందుకని మేము ఎలాంటి ప్రకటన చేసే పరిస్థితుల్లో లేము’ అని అంతర్జాతీయ హాకీ సమాఖ్య చెబుతోంది. సీజీఎఫ్ సైతం దాదాపు ఇదే తరహాలో స్పందించింది. ‘కామన్వెల్త్ క్రీడల షెడ్యూల్ రేపటితో ఖరారవుతుంది’ అని సీజీఎఫ్ ఒక్క మాటతో ముగించింది.
కామన్వెల్త్ దేశాలు మాత్రమే పాల్గొనే ఈ క్రీడలు 1998లో మొదలయ్యాయి. ఆరంభ సీజన్ నుంచి ప్రతి ఏడాది హాకీ పోటీలు పెడుతున్నారు. అయితే.. ఈసారి ఆతిథ్య హక్కులు దక్కించుకున్న స్కాట్లాండ్ దేశం మాత్రం బడ్జెట్ సాకుతో రెండు, మూడు ఆటల్ని తీసేయాలని నిర్ణయించుకుంది. హాకీతో పాటు నెట్ బాల్ (Net Ball), రోడ్ రేసింగ్ (Road Racing) క్రీడలను మినహాయించి మిగతా పోటీలను జరిపేందుకు గ్లాస్గో ప్రతినిధులు సమాయాత్తమవుతున్నారు. ఆస్ట్రేలియా తప్పుకోవడంతో కామన్వెల్త్ గేమ్స్ 2026 నిర్వహణకు స్కాట్లాండ్ ముందుకొచ్చింది. రెండేండ్ల తర్వాత జూలై 23 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు టోర్నీ జరుగనుంది.