న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) తొలిసారి ఎన్నికల్లో పోటీ సిద్ధమయ్యారు. సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ప్రియాంక గాంధీ సోమవారం సమావేశమయ్యారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
కాగా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అధినేత్రి, తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు కూడా ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్ ఎదుట యూడీఎఫ్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేస్తారని పేర్కొన్నారు. దీనికి ముందు ఉదయం 11 గంటలకు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ రోడ్‌షో నిర్వహిస్తారని వెల్లడించారు.
మరోవైపు 52 ఏళ్ల ప్రియాంక గాంధీ ఐదేళ్ల కిందట కాంగ్రెస్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే వాయనాడ్ నుంచి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ, ప్రియాంక గాంధీ విజయంతో దాని నుంచి బయటపడాలని, వయనాడ్ స్థానాన్ని నిలుపుకోవాలని భావిస్తున్నది.