e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home Top Slides Hockey India Team : మధురమీ విజయం...

Hockey India Team : మధురమీ విజయం…

  • భారత హాకీ జట్టు కాంస్య మెరుపులు
  • 41 ఏండ్ల సుదీర్ఘ కల సాకారం
  • జర్మనీపై 5-4తో అద్భుత విజయం
  • రెజ్లింగ్‌లో రవిదహియాకు రజతం
  • సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ అభినందనలు

భారత క్రీడా చరిత్రలో అపూర్వ ఘట్టం. కోట్లాది మంది క్రీడాభిమానుల మది గర్వంతో ఉప్పొంగిపోయే సందర్భం. ఏండ్లుగా ఎదురుచూస్తున్న సుదీర్ఘ కల సాకారమైన క్షణం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుకున్న అభిమానుల అంచనాలు ఫలించిన వైనం. జపాన్‌ గడ్డపై భారత హాకీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించిన సమయం. నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ మన్‌ప్రీత్‌సింగ్‌ సారథ్యంలోని భారత్‌ కాంస్య వెలుగులు విరజిమ్మింది.

గురువారం జర్మనీతో జరిగిన పోరులో 5-4 తేడాతో అద్భుత విజయం అందుకున్న టీమ్‌ఇండియా.. హాకీకి నూతన జవసత్వాలు తీసుకొచ్చింది. ప్రాణం పెట్టి పోరాడిన ఆటలో పటిష్ఠ జర్మనీని నిలువరిస్తూ భారత్‌ కాంస్య పతకాన్ని ముద్దాడిన వేళ..దేశంలో పండుగ వాతావరణం నెలకొన్నది. పురుషుల రెజ్లింగ్‌ 57కిలోల ఫ్రీైస్టెల్‌ ఫైనల్‌ పోరులో పోరాడి ఓడిన రైతు బిడ్డ రవికుమార్‌ దహియా.. రజత పతకంతో మెరిశాడు. మొత్తంగా గురువారం భారత్‌ రెండు పతకాలను తన ఖాతాలో వేసుకున్నది. హాకీ జట్టుతోపాటు రెజ్లర్‌ రవి దహియాకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

- Advertisement -

అడుగు పడింది..!
నవశకానికి నాంది పలుకుతూ.. యావత్‌ భారతావనిని ఉర్రూతలూగిస్తూ.. హాకీలో గత వైభవాన్ని గుర్తుచేస్తూ.. విశ్వక్రీడల్లో నాలుగు దశాబ్దాల తర్వాత భారత జట్టు పతకం సాధించింది. ప్లే ఆఫ్‌ పోరులో జర్మనీని చిత్తుచేసిన మన్‌ప్రీత్‌ సింగ్‌ సేన కాంస్య పతకం చేజిక్కించుకోవడంతో.. దేశం మొత్తం సంబురాల్లో మునిగిపోయింది. రెజ్లింగ్‌లో రవి దహియా రజతం కైవసం చేసుకోగా.. యువ రెజ్లర్లు దీపక్‌ పునియా, వినేశ్‌ ఫోగట్‌ ఆకట్టుకోలేకపోయారు. మహిళల హాకీ జట్టు కాంస్యం కోసం గ్రేట్‌ బ్రిటన్‌తో తలపడనుండగా.. ‘బిగ్‌ బుల్‌’బజరంగ్‌ నేడు బరిలోకి దిగనున్నాడు!

టోక్యో: నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం నెగ్గింది. గురువారం కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత్‌ 5-4తో జర్మనీపై విజయం సాధించింది. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో ఐదో పతకం వచ్చి చేరింది. విశ్వక్రీడల హాకీలో భారత్‌కిది 12వ పతకం కాగా.. అందులో ఎనిమిది స్వర్ణాలు, ఓ రజతం, మూడు కాంస్యాలున్నాయి. ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో భారత్‌ తరఫున సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (17వ, 34వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ కొట్టగా.. హార్దిక్‌ సింగ్‌ (27వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (29వ ని), రూపిందర్‌పాల్‌ సింగ్‌ (31వ ని) ఒక్కో గోల్‌ సాధించారు. చరిత్రాత్మక విజయం అనంతరం భారత జట్టు సభ్యులంతా నీళ్లు నిండిన కండ్లతో సంబురాలు చేసుకుంటుంటే.. 41 ఏండ్ల తర్వాత విశ్వవేదికపై దేశానికి పతకం దక్కడంలో ప్రధాన పాత్ర పోషించిన గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌ గోల్‌ పోస్ట్‌పైకి ఎక్కి వేసిన చిందులను క్రీడాభిమానులు ఇప్పట్లో మరువలేరు.

సిమ్రన్‌జీత్‌ డబుల్‌ ధమాకా..
మ్యాచ్‌ ఆరంభమైన రెండో నిమిషంలోనే గోల్‌ కొట్టిన జర్మనీ ఆధిక్యంలోకి దూసుకెళ్లగా.. కాస్త ఒత్తిడిలో కనిపించిన భారత్‌ తొలి క్వార్టర్‌లో గోల్‌ కొట్టలేకపోయింది. ఎట్టకేలకు రెండో క్వార్టర్‌లో సిమ్రన్‌జీత్‌ భారత ఖాతా తెరువగా.. కాసేపట్లోనే జర్మనీ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ కొట్టి 3-1తో ఆధిక్యంలో నిలిచింది. 27వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ ఫ్లిక్‌ చేయగా.. ప్రత్యర్థి గోల్‌ కీపర్‌ దాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నాడు. వెంటనే సర్కిల్‌లో బంతి ని దొరకబుచ్చుకున్న హార్దిక్‌ సింగ్‌ దానిని పోస్ట్‌లోకి పంపి భారత శిబిరంలో ఆనందం నింపగా.. మరో రెండు నిమిషాలకే వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌గా మలిచి స్కోరు సమం చేశాడు. మూడో క్వార్టర్‌ ఆరంభంలో రూపిందర్‌ పాల్‌ సింగ్‌, సిమ్రన్‌జీత్‌ సింగ్‌ గోల్స్‌ కొట్టడంతో భారత్‌ 5-3తో లీడ్‌లోకి వెళ్లింది. ఈ క్రమంలో జర్మనీ మరో గోల్‌ చేసింది. ఇక మ్యాచ్‌ ముగియడానికి ఆరు సెకన్ల ముందు ఆ జట్టుకు పెనాల్టీ కార్నర్‌ రూపంలో స్కోరు సమం చేసే అవకాశం వచ్చినా వాళ్లు దాన్ని వినియోగించుకోలేకపోవడంతో భారత్‌ విజయం ఖాయమైంది.

తండ్లాట తీరుస్తూ..
దేశ ప్రథమ పౌరుడి నుంచి..సాదాసీదా వ్యక్తుల దాకా..ఢిల్లీ పెద్దల నుంచి.. గల్లీ పోరగాండ్ల దాక..సెలెబ్రిటీల నుంచి.. సామాన్య జనం దాక..ఎక్కడ చూసినా ఒకటే చర్చ..ఒలింపిక్స్‌లో భారత్‌ కాంస్యం నెగ్గడం గురించే ముచ్చట..!ఇందులో ఏమున్నది ప్రత్యేకత..గెలిచింది కాంస్యమే కదా ఎందుకింత ఆనందం..?

పతకం కంచుదే కావొచ్చు.. కానీ దాని విలువ ఏ వజ్రానికీ తీసిపోనిది! జాతిని జాగృతం చేసే దిశగా.. యావత్‌ భారతావనిని ఏకం చేసిన విజయమిది! ఒలింపిక్స్‌ హాకీలో ఒకప్పుడు సమస్త భువనాన్ని కనుసన్నలతో శాసించిన చరిత్ర ఉన్న భారత్‌.. ఇటీవలి కాలంలో విశ్వక్రీడలకు అర్హత సాధిస్తే అదే గొప్ప అనే దశకు చేరింది. ఇలాంటి స్థితిలో క్రీడాలోకంలో కొత్త ఆశలు రేపుతూ.. పూర్వవైభవం దిశగా పడిన తొలి అడుగిది! ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణాలు చేజిక్కించుకొని ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న భారత్‌.. నాలుగు దశాబ్దాల తర్వాత తిరిగి తన అస్తిత్వాన్ని చాటుకున్న అపూరూప క్షణమిది! ‘ది కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ లోకానికి హెచ్చరికలు జారీచేసిన అద్వితీయ సందర్భమిది! అందుకే ఈ పతకానికి ఇంత ప్రత్యేకత. ఫీల్డ్‌లో భారత ఆటగాళ్లు చిరుత పులుల్లా ప్రత్యర్థులను చెడుగుడాడుకుంటుంటే.. మైదానంలో ఆడుతున్నది తామే అన్నట్లు ఊగిపోయిన ప్రతీ క్రీడాభిమాని మరిచిపోలేని భావోద్వేగ ఘట్టమిది! గతమెంతో ఘనం అంటూ.. ఒకప్పటి విజయాలను నెమరువేసుకోవడంతోనే సంతృప్తి పడుతున్న భారతీయుల గుండెలు ఉప్పొంగిన తరుణమిది! భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రస్ఫుటించే మన దేశంలో.. సమిష్టి కృషికి దక్కిన అత్యుత్తమ విజయమిది!

హాకీలో.. భారత పతకాలు

1928 (అమస్టర్‌డమ్‌) స్వర్ణం
1932 (లాస్‌ ఏంజిల్స్‌) స్వర్ణం
1936 (బెర్లిన్‌) స్వర్ణం
1948 (లండన్‌) స్వర్ణం
1952 (హెల్సెంకి) స్వర్ణం
1956 (మెల్‌బోర్న్‌) స్వర్ణం
1960 (రోమ్‌) రజతం
1964 (టోక్యో) స్వర్ణం
1968 (మెక్సికో) కాంస్యం
1972 (మ్యూనిచ్‌) కాంస్యం

1980 (మాస్కో) స్వర్ణం
2020 (టోక్యో) కాంస్యం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు కాంస్య పతకం, రెజ్లింగ్‌లో రవికుమార్‌ దహియా రజత పతక విజయాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లో సంబురాల్లో పాల్గొన్న క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర హాకీ సంఘం ప్రతినిధులు.

41 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌ హాకీలో పతకం సాధించిన భారత జట్టుకు అభినందనలు. జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఈ చరిత్రాత్మక విజయం భారత హాకీలో నవశకానికి నాంది పలుకుతుంది. అంతేగాక ఈ క్రీడలో రాణించాలనే యువతకు ఈ విజయం ఎంతో స్ఫూర్తినిస్తుంది.

  • రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

మన్‌ప్రీత్‌ సింగ్‌జీ.. మీకు అభినందనలు. భారత జట్టు చాలా గొప్ప విజయం సాధించింది. ఈ గెలుపుతో యావత్‌ భారతావని సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నది. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించింది. ఆటగాళ్లందరికీ అభినందనలు. దేశం మిమ్మల్ని చూస్తూ గర్విస్తున్నది.

-ప్రధాని నరేంద్ర మోదీ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement