Hockey India League : ప్రతిష్ఠాత్మక హాకీ ఇండియా లీగ్(Hockey India League) మళ్లీ వస్తోంది. ఎనిమిదేండ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది డిసెంబర్లో మెగా టోర్నీ షురూ కానుంది. దాంతో, హాకీ ఇండియా (Hockey India) రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆరంభించింది. ఈ మెగా లీగ్‌లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్న జట్లు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
అంతేకాదు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కోసం ప్రత్యేక అప్లికేషన్ ఫామ్‌ను అందుబాటులో ఉంచింది. దరఖాస్తులు స్వీకరించేందుకు జూన్ 30 ఆఖరి తేదీ అని హాకీ ఇండియా వెల్లడించింది. ‘ఇదొక గొప్ప ముందడుగు. హాకీ ఇండియా లీగ్ పునఃప్రారంభానికి మరింత చేరువయ్యాం. ఈ లీగ్‌ను హాకీ ఆటగాళ్లు, అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. భారత ఆటగాళ్లకు ప్రపంచంలోని హాకీ స్టార్లతో పోటీ పడేందుకు ఇదొక చక్కని అవకాశం’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టర్కీ(Dilip Tirkey) అన్నాడు.
భారత గడ్డపై 2017లో చివరిసారిగా హాకీ ఇండియా లీగ్ జరిగింది. ఆ తర్వాత మెగా టోర్నీ నిర్వహణ కుదరలేదు. అయితే.. నిరుడు (2023) హాకీ ఇండియా లీగ్ టోర్నీ ఈ ఏడాది డిసెంబర్ – వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్య హాకీ ఇండియా లీగ్ షురూ కానుంది. ఈ మెగా టోర్నీలో ప్రపంచ స్థాయి జట్లు పోటీ పడనున్నాయి. మొత్తంగా పురుషుల విభాగంలో 8 జట్లు, మహిళల విభాగంలో ఆరు జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈసారి టోర్నీకి ఓ ప్రత్యేకత ఉంది. మహిళలకు తొలిసారి అవకాశమిచ్చారు. దాంతో, హాకీ ఇండియా లీగ్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండనుంది.