అహ్మదాబాద్: హౌసింగ్ స్కీమ్ కింద ముస్లిం కుటుంబానికి ఇంటిని అధికారులు కేటాయించారు. హిందువులైన అక్కడి నివాసితులు దీనిని వ్యతిరేకించారు. (residents protest) సంబంధిత చట్టం నిబంధనలను అధికారులు ఉల్లంఘించారని ఆరోపించారు. గుజరాత్లోని వడోదరలో ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద హర్ని ప్రాంతంలో 462 ఇళ్లతో హౌసింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. 2017లో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ఫ్లాట్లు కేటాయించారు. ఇందులో భాగంగా ఒక ముస్లిం మహిళకు ఒక ఇల్లు సమకూరింది.
కాగా, ముస్లిం కుటుంబానికి ఇల్లు కేటాయించడాన్ని మోత్నాథ్ నివాసితులు వ్యతిరేకించారు. అక్కడ నిరసన చేపట్టారు. గుజరాత్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో ‘డిస్టర్బెన్స్ ఏరియా యాక్ట్’ను అమలు చేసిందని స్థానికులు తెలిపారు. దీంతో హిందూ కాలనీలో ముస్లింలకు ఇల్లు కేటాయించకూడదని అన్నారు. ప్రభుత్వ అధికారులు ఆ నిబంధనను అమలు చేయకుండా ముస్లిం మహిళకు ఇల్లు ఇచ్చారని విమర్శించారు. ముస్లిం కుటుంబం ఉంటడం వల్ల తాము సుఖంగా లేమని వారు ఆరోపించారు. ఆ ఇంటి కేటాయింపును ప్రభుత్వం రద్దు చేయకపోతే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు నిరసనలు చేస్తామని స్థానికులు హెచ్చరించారు.
మరోవైపు వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఆరోపణలను ఖండించింది. డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్ అమలు చేయక ముందు లాటరీ విధానం ద్వారా ఈ కేటాయింపు జరిగిందని స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ తెలిపారు. ఒకసారి ఆమోదించిన తర్వాత ఆ కేటాయింపును చట్టబద్ధంగా రద్దు చేయడం కుదరదని చెప్పారు. అయితే స్థానిక నివాసితుల నిరసనల దృష్ట్యా ఆ ఇంటిని ఖాళీ చేయమని ముస్లిం ఇంటి యజమానిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.