WBBL : మహిళల టీ20 లీగ్ అయిన బిగ్‌బాష్ లీగ్‌లో సంచలనం నమోదైంది. హొబర్ట్ హరికేన్స్ (Hobart Hurricanes) ఓపెనర్ లిజెల్లె లీ (Lizelle Lee) చరిత్రను తిరగరాసింది. ఆదివారం పెర్త్ స్కాచర్స్ బౌలర్లకు దడ పుట్టిస్తూ లిజెల్లె రికార్డు స్కోర్ కొట్టింది. 150 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ గ్రేస్ హ్యారిస్ (Grace Hariis) పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టింది. లిజెల్లే విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో హొబర్ట్ జట్టు 75 పరుగుల తేడాతో గెలుపొందింది.
పెర్త్ స్కాచర్స్ బౌలర్లు చెలరేగడంతో 16 పరుగులకే హోబర్ట్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. అయినా సరే అధైర్యపడని లిజెల్లె వీరకొట్టుడుతో పెర్త్ జట్టు బౌలర్లను వణికిచింది. బౌండరీలతో విరుచుకుపడ్డ ఆమె కేవలం 29 బంతుల్లోనే లిజెల్లే హాఫ్ సెంచరీకి చేరువైంది.
One for the history books!
Lizelle Lee’s WBBL record 150* included 12 ridiculous sixes 😱
Enjoy it all 🎥 #WBBL10 pic.twitter.com/TbpABk1Mr6
— Weber Women’s Big Bash League (@WBBL) November 10, 2024
అర్ధ శతకం తర్వాత మరింత ధాటిగా ఆడి 51 బంతుల్లోనే వంద బాదేసింది. 75 బంతులు ఎదుర్కొన్న లిజెల్లే 12 సిక్సర్లతో విజృంభించింది. ఆమె విధ్వంసక ఇన్నింగ్స్ ఆడగా.. హోబర్ట్ జట్టు 75 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
1. లిజెల్లె లీ – 150 నాటౌట్
2. గ్రేస్ హ్యారిస్ – 136 నాటౌట్
3. స్మృతి మందాన – 114 నాటౌట్
4. అషే గార్డ్నర్ – 114
5. అలీసా హేలీ – 112 నాటౌట్
మహిళల టీ20ల్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్ల మహరాణిగా లిజెల్లె మరో రికార్డు తన పేరిట రాసుకుంది. పెర్త్ స్కాచర్స్పై 12 సార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపిన ఆమె గ్రేస్ హ్యారిస్‌ను రెండో స్థానానికి నెట్టేసింది. ఇక లారా అగత కూడా 11 సిక్సర్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ బ్యాటర్ అషే గార్డ్నర్ 10, వెస్టిండీస్ హిట్టర్ డియాండ్ర డాటిన్ 9 సిక్సర్లతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.