ఢిల్లీ : భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో మరో మైలురాయి. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో తొలిసారి భారత్ నుంచి మూడు జోడీలు టాప్-10లోకి ప్రవేశించాయి. పురుషుల, మహిళల, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మన ప్యాడ్లర్లు అత్యుత్తమ ర్యాంకులకు చేరుకుని సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.
ఐటీటీఎఫ్ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం మెన్స్ డబుల్స్ లో మానుష్ షా- మానవ్ ఠక్కర్ జోడీ ప్రపంచ రెండో ర్యాంక్ సాధించింది. డబుల్స్ విభాగంలో భారత్ నుంచి ఇదే అత్యుత్తమ ర్యాంక్. ఇక మహిళల డబుల్స్‌లో దివ్య చిటాలె-యశస్విని ఘోర్పడె పదో ర్యాంక్‌కు చేరగా మిక్స్డ్ డబుల్స్‌లో దివ్య- మానుష్ టాప్-5కి చేరుకున్నారు.