హైదరాబాద్, అక్టోబర్26(నమస్తే తెలంగాణ): తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. పిటిషనర్ అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని అసోసియేషన్‌తో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
రెండు వారాల్లోగా సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది తదుపరి విచారణ వాయిదా వేసింది. తెలంగాణ కబడ్డీ సంఘం కార్యవర్గానికి ఈ నెల 7న ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ జాతీయ కబడ్డీ క్రీడాకారుడు బసాని హేమంత్ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. అసోసియేషన్ ఎన్నికలను వాయిదా వేయాలన్న పిటిషనర్ వినతిని తోసిపుచ్చారు. ఎన్నికలు అక్రమ మార్గంలో జరిగాయని తేలితే ఫలితాలు వెలువడిన తర్వాతనైనా ఆ ఎన్నికలను రద్దు చేస్తామన్నారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌కు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి.