హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : నేషనల్ స్పోర్ట్స్ కోడ్-2011ను అమలు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌కు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. పార్ట్‌టైం సభ్యులు, ఉద్యోగులతో అసోసియేషన్‌ను కొనసాగించడాన్ని సవాలు చేస్తూ కబడ్డీ కోచ్ పవన్ కుమార్‌యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అసోసియేషన్‌లో పార్ట్‌టైమ్ సభ్యులు, ఉద్యోగులు ఉంటున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ అసోసియేషన్లలో సభ్యులుగా ఉండటం వల్ల క్రీడాభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్నారు. అసోసియేషన్ల పనితీరుపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ క్రీడా అసోసియేషన్ల నిర్వహణలో ప్రభుత్వం పాత్ర పరిమితమేనన్నారు. రాష్ట్ర కబడ్డీ సంఘానికి నోటీసులు ఇస్తూవిచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.