SLW vs AUSW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో బోణీ కొట్టాలనుకున్న శ్రీలంక (Srilanka) ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియా (Australa)తో జరగాల్సిన మ్యాచ్‌కు టాస్ ముందు నుంచి వాన కురుస్తూనే ఉండడంతో ఆట రద్దయ్యింది. దాంతో.. ఆసీస్‌కు చెక్ పెట్టి పాయింట్ల ఖాతా తెరవాలనుకున్న చమరి ఆటపట్టు నేతృత్వంలోని లంక టీమ్ తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.
వరల్డ్ కప్ లీగ్ దశలో 5వ మ్యాచ్ కొలంబోలోని ప్రేమదా స్టేడియంలో జరగాల్సింది. మధ్నాహ్యానికి ఇరుజట్ల ప్లేయర్లు స్టేడియానికి చేరుకున్నారు కూడా. కానీ, టాస్ వేద్దామనుకునే సమయానికి వాన మొదలైంది. కాసేపటికే తెరిపినిచ్చినా మళ్లీ జోరుగా వర్షం పడింది. దాంతో.. వాన తగ్గితే బాగుండు అని నాలుగ్గంటలపైగా శ్రీలంక, ఆసీస్ క్రికెటర్లు, అంపైర్లు ఎదురుచూశారు. అయినా సరే వరుణుడు శాంతించకపోవడంతో రద్దుకే మొగ్గుచూపారు. మామూలుగా అయితే.. మ్యాచ్ నిర్వహించాలా? వద్దా? అనేది నిర్ణయించేందుకు కటాఫ్ సమయం రాత్రి 8:08 గంటలు. కానీ, సాయంత్రం ఆరు గంటలు కావొస్తున్నా వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు కెప్టెన్లు ఆటపట్టు, అలీసా హేలీతో మాట్లాడి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
The points are shared in Colombo 🤝🌧️ #SLvAUS details: https://t.co/TC4pPLxeOq pic.twitter.com/HCysxAHtbF
— ESPNcricinfo (@ESPNcricinfo) October 4, 2025
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఆసీస్, లంకకు చెరొక పాయింట్ మాత్రమే దక్కనుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 89 పరుగులతో ఓడించిన కంగారూ టీమ్‌కు మూడు పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. శ్రీలంక జట్టు మాత్రం ఒకేఒక పాయింట్‌తో ఐదో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్, బంగ్లాదేశ్, భారత్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే.. రేపు (అక్టోబర్ 5 ఆదివారం) ఇదే ప్రేమదాస స్టేడియంలో టీమిండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఒకవేళ ఈరోజు మాదిరిగానే వర్షం పడితే దాయాదుల మ్యాచ్ కొనసాగుతుందా? లేదా? అని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.