Womens ODI World Cup : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే వరల్డ్ కప్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) స్క్వాడ్‌ను ప్రకటించింది. నాట్ సీవర్ బ్రంట్ (Nat Sciver-Brunt) కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు. గాయం కారణంగా కొన్ని నెలలుగా జట్టుకు దూరమైన మాజీ సారథి హీథర్ నైట్(Heather Knight)కు స్క్వాడ్‌లో చోటు దక్కింది. బ్యాటింగ్ యూనిట్‌తో పాటు పటిష్టమైన బౌలింగ్ దళం కూడా ముఖ్యమని భావించిన ఈసీబీ మ్యాచ్ విన్నర్లను సెలెక్ట్ చేసింది. ఉపఖండంలో స్పిన్నర్లు కీలకం అవుతారనే లక్ష్యంతో ఏకంగా నలుగురిని తీసుకున్నారు.
‘మహిళల వన్డే వరల్డ్ కప్ కోసం సమతూకంతో ఉన్న స్క్వాడ్‌ను ఎంపిక చేశాం. భారత్, శ్రీలంకలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉపఖండంలో రాణించగల ప్లేయర్లను తీసుకున్నాం. మా స్పిన్ యూనిట్ చాలా పకడ్బందీగా ఉంది. అందుకే అదనపు స్పిన్నర్‌ను తీసుకోగలిగాం’ అని హెడ్‌కోచ్ చార్లొట్టే ఎడ్వర్డ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకూ వరల్డ్ కప్ జరుగనుంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ తమ తొలిపోరులో దక్షిణాఫ్రికాను ఢీకొననుంది. అక్టోబర్ 3న ఇరుజట్లు బెంగళూరులో తలపడనున్నాయి.
JUST IN: England name their squad for the Women’s World Cup 🏴 pic.twitter.com/nrCSy2gxDO
— ESPNcricinfo (@ESPNcricinfo) August 21, 2025
ఇంగ్లండ్ వరల్డ్ కప్ స్క్వాడ్ : నాట్ సీవర్ బ్రంట్ (కెప్టెన్), టమ్మీ బ్యూమంట్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), హీథర్ నైట్, డానీ వ్యాట్ హొడ్గే, ఎమ్మా లాంబ్, సోఫీ డంక్లే, అలిసే క్యాప్సే, సోఫీ ఎకిల్‌స్టోన్, చార్లీ డీన్, సరాహ్ గ్లెన్, లిన్సే స్మిత్, లారెన్ బెల్, లారెన్ ఫిలర్, ఎమ్ అర్లాట్.
తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న హీథర్ నైట్ రాకతో ఇంగ్లండ్ బ్యాటింగ్ బలం మరింత పెరగనుంది. మిడిలార్డర్ బ్యాటర్ అయిన ఆమె జట్టులో సీనియర్ కూడా. మాజీ సారథిగా ఆమె బ్రంట్‌కు విలువైన సలహాలు ఇచ్చే అవకాశముంది. ఇక.. వన్డేల్లో గత కొన్నిరోజులుగా నిలకడగా రాణిస్తున్న టమ్మీ బ్యూమంట్, అమీ జోన్స్, డానీ వ్యాట్, అలిసే క్యాప్సేలు బ్యాటింగ్ భారం మోయనున్నారు. బౌలింగ్ యూనిట్లో స్పిన్నర్లకు సెలెక్టర్లు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధాన స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్ (Sophie Ecclestone)తో పాటు సరాహ్ గ్లెన్, చార్లీ డీన్, లిన్సే స్మిత్‌లు స్పిన్ దళంలో ఉన్నారు. అయితే.. సీనియర్ బౌలర్లు అయిన కేట్ క్రాస్, మియామి బౌచర్, అలిసే డేవిడ్సన్, రిచర్డ్స్‌లను మాత్రం సెలెక్టర్లు పక్కనపెట్టేశారు.