|న్యూఢిల్లీ, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో నెలకొన్న వివాదాలు, కుటుంబ పెత్తనం, ఎలక్ట్రోరల్ జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణపై జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ నివేదికపై సుప్రీం కోర్టు విచారించింది. బుధవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. దాదాపు గంటన్నర పాటు వాద, ప్రతివాదుల తరఫు సీనియర్ అడ్వకేట్లు సిద్దార్థ్ దవే, అమిత్ సిబల్, జయంత్ భూషణ్, రాకేశ్‌కుమార్, విపిన్ సంఘీ, ఏకే ప్రసాద్, గౌరవ్ అగర్వాల్, సుధీర్‌కుమార్ సక్సేనా వాదనలు వినిపించారు.
సుదీర్ఘ వాద, ప్రతివాదనల తర్వాత గురువారం మధ్యాహ్నా 2 గంటలకు విచారణ వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల వివాదం, ఓటరు నమోదు తదితర అంశాలపై 30 ఏప్రిల్, 2021లో సుప్రీం కోర్టులో హెచ్‌సీఏ పీటీషన్ దాఖలు చేసింది. ఇందులో చార్మినార్ క్రికెట్ క్లబ్, బడ్డింగ్ స్టార్ క్రికెట్ క్లబ్‌లను ప్రతివాదులుగా చేర్చింది. జస్టిస్ లావు నాగేశ్వర్రావు నేతృత్వంలో ఏకసభ్య కమిటీని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. అప్పటికే తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన హెచ్‌సీఏలో ఏకసభ్య కమిటీ ప్రక్షాళనకు పూనుకుంది. హెచ్‌సీఏ పరిధిలో మొత్తం 217 క్లబ్‌లు ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కుటుంబాలకు 57 క్లబ్‌లు ఉన్నట్లు గుర్తించింది. క్లబ్‌లను తమ గుప్పిట్లో పెట్టుకుని హెచ్‌సీఏ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారన్న కారణంతో ఆ క్లబ్‌లపై కమిటీ నిషేధం వేసింది. దీన్ని సవాలు చేస్తూ క్లబ్‌లకు చెందిన ప్రతినిధులు సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.