హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా ఈ నెల 25నుంచి మొదలయ్యే భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మీడియా సమావేశంలో ప్యానెల్ సభ్యులతో కలిసి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు మాట్లాడారు. ‘ప్యానెల్ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి టెస్టును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నాం. టెస్టు జరుగనున్న ఐదు రోజుల పాటు 25వేల మంది విద్యార్థులకు ఉచితంగా ప్రవే శం కల్పిస్తున్నాం.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. స్కూల్ ప్రిన్సిపాల్ నుంచి వచ్చిన లెటర్ల ఆధారంగా టికెట్లు కేటాయిస్తున్నాం. విద్యార్థులకు ఉచితంగా భోజనం, మంచినీరు అందిస్తాం. రిపబ్లిక్ డే సందర్భంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబాలకు ఉచితంగా మ్యాచ్‌ను వీక్షించే అవకాశం కల్పిస్తున్నాం. ఇప్పటికే 26వేల టికెట్లు అమ్ముడుపోయాయి. స్టేడియం నలువైపులా పైకప్పు, కొత్త కుర్చీలు, నూతన ఎల్ఈడీ లైట్లతో మైదానం ముస్తాబైంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ సభ్యులు దేవరాజ్, బసవరాజు, దల్జీత్‌సింగ్, శ్రీనివాస్‌రావు, సునీల్ పాల్గొన్నారు.