Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat)కు స్వదేశంలో భారీ మద్దతు లభిస్తోంది. 100 గ్రాముల అదనపు బరువుతో ఫైనల్ ఆడలేకపోయిన ఆమె అప్పీల్‌పై అర్బిట్రేషన్ కోర్టు (CAS) తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వినేశ్‌కు రజతం వస్తుందా? లేదా? అని యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే.. విశ్వ క్రీడల్లో విశేషంగా రాణించిన వినేశ్ ఫోగాట్‌కు గోల్డ్ మెడల్ ఇస్తామని హర్యానాకు చెందని ఖాప్ పంచాయతీ (Khap Panchayat) ప్రకటించింది.
వినేశ్ స్వరాష్ట్రమైన హర్యానాలోని ఖాప్ పంచాయతీల్లో ఒకటైన నందాల్ (Nandal) ఆమెకు పసిడి పతకాన్ని బహూకరించనుంది. నందాల్ పంచాయతీ పెద్ద ఓం ప్రకాశ్ నందాల్ (Om Prakash Nandal) ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘పారిస్ నుంచి వినేశ్ స్వదేశం రాగానే ఖాప్ పంచాయతీలు ఆమెను సన్మానిస్తాయి.

అనంతరం స్వర్ణ పతకంతో ఆమెను సత్కరిస్తాయి’ అని ఓం ప్రకాశ్ తెలిపాడు. అంతేకాదు ఒలింపిక్స్‌లో వినేశ్‌ను అనర్హురాలిగా ప్రకటించడంపై విచారణ జరిపించాల్సిందిగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అభ్యర్థించారు. ఒలింపిక్స్ 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫోగట్‌కు బుధవారం ఊహించని షాక్ తగిలింది.100 గ్రాముల అదనపు బరువు కారణంగా నిర్వాహకులు ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో, భారమైన హృదయంతో ఆమె రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది.

అనంతరం అడ్ హక్ ప్యానెల్ క్రీడా కోర్టులో తనకు న్యాయం చేయాలని, గురువారం జరుగబోయే ఫైనల్లో తనను అనుమతించాలని అప్పీల్ చేసింది. కానీ, సదరు కోర్టు ఆలస్యంగా స్పందించింది. సీఏసీ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. క్రీడలకు సంబంధించిన వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరిస్తుంటుంది.