లండన్: ప్రపంచ క్రికెట్‌పై తనదైన శైలిలో ముద్ర వేసిన దిగ్గజ అంపైర్ డికీ బర్డ్ కన్నుమూశాడు. వయసు సంబంధిత సమస్యలతో 92 ఏండ్ల వయసులో మంగళవారం తుదిశ్వాస విడిచాడు. 1973-1996 సమయంలో పలు చారిత్రక మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించిన డికీ బర్డ్ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. మైదానంలోనే కాకుండా బయటా క్రికెటర్లతో మంచి సంబంధాలు కొనసాగించడంలో దిట్ట అయిన బర్డ్ చివరి వరకు ఆటను అమితంగా ప్రేమించాడు. 1956లో యార్క్‌షైర్ తరఫున కౌంటీల్లో అరంగేట్రం చేసిన బర్డ్ 93 మ్యాచ్‌ల్లో 3,314 పరుగులు చేశాడు.
ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. మరోవైపు 66 టెస్టులు, 69 వన్డేల్లో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 1996లో భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ బర్డ్‌కు ఆఖరిది. ఇదే మ్యాచ్‌లో భారత దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ అరంగేట్రం చేశారు. ఇదిలా ఉంటే క్రికెట్‌ను శాసించిన గ్యారీ సోబర్స్, వీవీయన్ రిచర్డ్స్, డెన్నిస్ లిల్లీ, ఇయాన్ బోథమ్ లాంటి ఐకాన్ ప్లేయర్లతో బర్డ్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. డికీ బర్డ్ మృతి పట్ల భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశాడు.