ముంబై : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతున్నది. ఈ లీగ్ చరిత్రలో గుజరాత్ జెయింట్స్‌పై పరాభవమెరుగని ముంబై.. అదే రికార్డును కొనసాగిస్తూ ఆ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఇరు జట్ల మధ్య ముంబైలో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో జెయింట్స్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19.2 ఓవర్లలోనే దంచేసింది. ఛేదనలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 71 నాటౌట్, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగా అమన్‌జ్యోత్ కౌర్ (26 బంతుల్లో 40, 7 ఫోర్లు), నికోల కేరీ (23 బంతుల్లో 38 నాటౌట్, 6 ఫోర్లు) హర్మన్‌కు అండగా నిలిచారు. మొదట గుజరాత్ బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఆ జట్టు 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 192 రన్స్ చేసింది. జార్జియా వెర్హమ్ (33 బంతుల్లో 43 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్స్), ఫల్మలి (15 బంతుల్లో 36 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కనిక అహుజా (18 బంతుల్లో 35, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు.
భారీ ఛేదనలో ముంబై మూడో ఓవర్లోనే కమిలిని (13), హేలీ (22) వికెట్లు కోల్పోయినా బ్యాటింగ్‌లో ప్రమోషన్ పొందిన అమన్‌జ్యోత్‌తో కలిసి సారథి హర్మన్‌ప్రీత్ ఆ జట్టును ఆదుకున్నారు. హర్మన్ కాస్త ఆచితూచి ఆడినా అమన్ మాత్రం బౌండరీల వర్షం కురిపించింది. ఈ ద్వయం బౌండరీలు, సిక్సర్లతో రెచ్చిపోవడంతో ముంబై స్కోరు 11.2 ఓవర్లలోనే వంద పరుగులకు చేరుకుంది. కానీ డివైన్ రెండో స్పెల్‌లో అమన్.. గార్డ్నర్కు క్యాచ్ ఇవ్వడంతో 72 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖరి 6 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 69 రన్స్ అవసరమవగా హర్మన్, కేరీ బ్యాట్‌కు పనిచెప్పారు. రేణుకా వేసిన 16వ ఓవర్లో కేరీ.. ఐదు బౌండరీలు బాది 20 రన్స్ రాబట్టింది. కాశ్వీ ఓవర్లో సింగిల్‌తో 33 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన హర్మన్.. రాజేశ్వరి 18వ ఓవర్లో 2 ఫోర్లు కొట్టింది. దీంతో ముంబై విజయ సమీకరణం 2 ఓవర్లలో 14గా మారింది. ఈ ద్వయం సాఫీగా లాంఛనాన్ని పూర్తిచేసి ముంబైకి రెండో విజయాన్ని కట్టబెట్టింది. గుజరాత్‌పై ముంబై ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించడం విశేషం. అదీగాక ముంబైకి డబ్ల్యూపీఎల్‌లో ఇదే అత్యధిక ఛేదన.
ముంబై ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన జెయింట్స్ బ్యాటర్లు.. సమిష్టిగా రాణించారు. ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్కుకు చేరకపోయినా డివైన్ (8) మినహా మిగిలినవారంతా మెరుపులు మెరిపించారు. ఓపెనర్ మూనీ పరుగుల ఖాతా తెరవకముందే ఆమె ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ కమిలినీ జారవిడవడం జెయింట్స్‌కు కలిసొచ్చింది. ఆ తర్వాత ఓవర్లో మూనీతో పాటు డివైన్ చెరో రెండు బౌండరీలు కొట్టారు. షబ్నిమ్ 3వ ఓవర్లో డివైన్.. కమిలినికి క్యాచ్ ఇచ్చినా ఆమె స్థానంలో వచ్చిన కనిక అహుజా (18 బంతుల్లో 35, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి మూనీ వేగంగా ఆడింది. హేలీ 4వ ఓవర్లో 6,4తో అహుజా అలరించగా మూనీ సైతం కేరీ 6వ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టడంతో పవర్ ప్లేలోనే జెయింట్స్ 62/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే కెర్ రాకతో మూనీ కథ ముగిసింది. తర్వాత కెప్టెన్ గార్డ్నర్ (20) 4 బౌండరీలతో దూకుడుగా ఆడినా ఆమె ఎక్కువసేపు నిలువలేకపోయింది. 10వ ఓవర్లో కేరీ.. గార్డ్నర్ను వెనక్కిపంపగా మరుసటి ఓవర్లో హేలీ.. అహుజాను ఔట్ చేయడంతో జెయింట్స్ స్కోరు వేగం నెమ్మదించింది. 10-17 ఓవర్ మధ్య ఆ జట్టు చేసింది 44 పరుగులే. కానీ 18వ ఓవర్లో వెర్హమ్.. 6తో బాదుడుకు శ్రీకారం చుట్టగా కేరీ 19వ ఓవర్లో ఫల్మలి 4, 6, 4తో రెచ్చిపోయింది. అమన్ ఆఖరి ఓవర్లోనూ ఆమె 23 రన్స్ రావడంతో గుజరాత్ భారీ స్కోరు సాధించింది.
గుజరాత్: 20 ఓవర్లకు 192/5 (వెర్హమ్ 43*, ఫల్మలి 36*, షబ్నిమ్ 1/25, హేలి 1/34);
ముంబై: 19.2 ఓవర్లకు 193/3 (హర్మన్‌ప్రీత్ 71*, అమన్‌జ్యోత్ 40, డివైన్ 1/29, కాశ్వీ 1/33)