డర్హమ్: ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు.. వన్డే సిరీస్‌నూ కైవసం చేసుకునే క్రమంలో బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ఆతిథ్య జట్టుతో డర్హమ్ వేదికగా జరిగిన చివరి వన్డేలో మొదట బ్యాటింగ్ చేస్తూ 50 ఓవర్లకు 318/5 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (102) తన కెరీర్లో ఏడో శతకంతో కదం తొక్కగా జెమీమా (50), హర్లీన్ (45), మంధన (45) రాణించారు. ఆఖర్లో రిచా ఘోష్ (38*) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అలరించడంతో టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. 40 ఓవర్లకు భారత్.. 198/3తోనే ఉన్నా ఆఖరి 60 బంతుల్లో ఏకంగా 120 పరుగులు రాబట్టింది. 54 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసిన హర్మన్ ప్రీత్ తర్వాత శతకానికి 28 బంతులు మాత్రమే తీసుకుంది. అనంతరం ఛేదనలో కడపటి వార్తలందేసరికి ఇంగ్లండ్.. 44 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. భారత బౌలర్లలో యువ పేసర్ క్రాంతి గౌడ్ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు తీసి ఇంగ్లిష్ జట్టును దెబ్బకొట్టింది.