ముంబై: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో సత్తాచాటుతామని భారత మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ ధీమా వ్యక్తం చేసింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి యూఏఈ వేదికగా మొదలవుతున్న మెగాటోర్నీ కోసం మంగళవారం టీమ్ఇండియా బయల్దేరి వెళ్లింది. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న టీ20 ప్రపంచకప్‌ను ఈసారైనా ఒడిసిపట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న భారత్ ఆ దిశగా ముందుకెళుతున్నది. యూఏఈకి వెళ్లే ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్తో పాటు చీఫ్ కోచ్ అమోల్ మజుందార్, చీఫ్ సెలెక్టర్ నీతూ డేవిడ్ పాల్గొన్నారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్‌లో టీ20 ప్రపంచకప్ జరుగాల్సి ఉన్నా..అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా టోర్నీని యూఏఈకి మారుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. మెగాటోర్నీలో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తలపడనుంది. 2009లో మొదలైన ఈ మెగాటోర్నీలో భారత్ ఇప్పటి వరకు ఒక్కసారే(2020) ఫైనల్ చేరుకోగా, గతేడాది సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. ఏండ్లుగా అందకుండా పోతున్న పొట్టి కప్‌ను ఈసారి ఒడిసిపట్టుకునేందుకు భారత్ తహతహలాడుతున్నది.
సన్నాహాల్లో ముందున్నాం:
టీ20 ప్రపంచకప్‌పై హర్మన్‌ప్రీత్ స్పందిస్తూ ‘యూఏఈలో త్వరలో జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఆసియా కప్‌లో చేదు అనుభవం తర్వాత మా లోపాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ముఖ్యంగా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఎలా రాణించాలనే దాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నాం. దూకుడుకు మారుపేరైనా టీ20ల్లో పరిస్థితులకు తగ్గట్లు ఆటతీరు మార్చుకోవాల్సి ఉంటుంది. గత టోర్నీలకు భిన్నంగా ఈసారి అన్ని విభాగాల్లో జట్టు సత్తాచాటుతుందన్న నమ్మకం నాకుంది. యువ క్రికెటర్లకు తోడు అనుభవజ్ఞలు ఉండటం జట్టుకు కలిసిరానుంది. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో గత 10 రోజులుగా కఠిన శిక్షణ తీసుకున్నాం. ముఖ్యంగా ఫిట్నెస్, ఫీల్డింగ్‌లో మెరుగయ్యేందుకు చెమటోడ్చాం. ఇప్పటి వరకు చాలా మెగాటోర్నీలు ఆడిన అనుభవం నాకుంది. 19 ఏండ్ల వయసు నుంచి ఇప్పటి వరకు చాలా టోర్నీల్లో భాగమయ్యాను. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నుంచి బాగా పోటీ ఎదురయ్యే అవకాశముంది. ఐసీసీ ఈవెంట్లలో మమ్మల్ని ఎలా ఓడించాలో ఆసీస్‌కు బాగా తెలుసు. కానీ వారిని ఓడించే ఏకైక జట్టు భారత్ అన్న సంగతి వారికి కూడా తెలుసు’ అని ఉంది. మజుందార్ మాట్లాడుతూ గత పది రోజలుగా ఎన్సీఏలో ఫిటనెస్, ఫీల్డింగ్‌పై బాగా దృష్టి పెట్టామన్నాడు.