Harish Salve : ఈమధ్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) మాటల్లో దూకుడు కనబరుస్తోంది. విశ్వ క్రీడల్లో పతకం చేజారిన బాధలో ఉన్న తనతో ఫొటో దిగి..భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలు పీటీ ఉష (PT Usha) రాజకీయం చేశారని ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు పారిస్‌లో తనకు ఐఓఏ నుంచి తగినంత సహాయ సహకారాలు అందలేదని ఆమె ఆరోపించింది. అయితే.. ఫొగాట్ కామెంట్లను అమె తరఫున కాస్ కోర్టులో వాదించిన న్యాయవాది హరిశ్ సాల్వే (Harish Salve) ఖండించాడు.
‘క్రీడా కోర్టు తీర్పును సవాల్ చేద్దామనుకున్నాం. కానీ, వినేశ్ అంగీకరించలేదు. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయాలని ఆమె తమతో చెప్పిందని నాకు ఇతర న్యాయవాదులు చెప్పారు ‘అని సాల్వే తెలిపాడు. వినేశ్‌పై అనర్హతను కాస్ కోర్టులో సవాల్ చేయడం.. ఆపై కోర్టు తిరస్కరించిన తర్వాత జరిగిన పరిణామాలను తాజాగా సాల్వే వివరించాడు.
‘కాస్‌లో వినేశ్ తరఫున వాదనలు బలంగా వినిపించాం. ఆమెకు పతకం ఇవ్వాల్సిందేనని చెప్పాం. అంతేకాదు కోర్టు తీర్పును స్విట్జర్లాండ్‌లోని పై కోర్టులో సవాల్ చేద్దామని కూడా వినేశ్‌కు నేను చెప్పాను. కానీ, అమె ఈ కేసును ఇంతటితో వదిలేయాలనే నిర్ణయానికి వచ్చిందని తోటి లాయర్లు నాతో అన్నారు’ అని సాల్వే వెల్లడించాడు.
పారిస్ ఒలింపిక్స్ 50 కిలోల విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్‌కు ముందు అనర్హతకు గురైంది. 100 గ్రాముల అదనపు బరువు కారణంగా ఆమెను పోటీలో పాల్గొనకుండా అడ్డుకున్నారు. దాంతో, వినేశ్ తనకు వెండి పతకం ఇవ్వాల్సిందిగా కాస్‌ను సంప్రదించింది.
అయితే.. వారం రోజులపైనే ఆ విషయాన్ని నాన్చుతూ వచ్చిన కాస్.. వినేశ్ అప్పీల్‌ను కొట్టేసింది. క్యూబా రెజ్లర్‌తో పాటు ఆమెకు సిల్వర్ మెడల్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దాంతో, రెజ్లింగ్‌లో వెండి పతకం గెలుపొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించే అవకాశాన్ని వినేశ్ కోల్పోయిది. ఆ ఓణం యావత్ భారతావని గుండె పగిలినంత పనైందనుకో.