ముంబై: మహారాష్ట్రలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. (Blow To BJP) విదర్భ సీనియర్ నేత గోపాల్‌దాస్ అగర్వాల్ కాంగ్రెస్ గూటికి తిరిగి వచ్చారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన గోపాల్‌దాస్ వరుసగా మూడు సార్లు 2004, 2009, 2014లో గోండియా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఆయన చేరారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వినోద్ ఎస్ అగర్వాల్ చేతిలో ఓడిపోయారు.
కాగా, త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి ఆయన షాక్ ఇచ్చారు. శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను పంపారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రమేష్ చెన్నితాల, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్, అంసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజయ్ వాడెట్టివార్, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్, మాజీ మంత్రులు నితిన్ రౌత్, సునీల్ కేదార్ సమక్షంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.
మరోవైపు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న గిరిజన బెల్ట్‌లోని గోండియా స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గోపాల్‌దాస్ పోటీ చేయవచ్చని తెలుస్తున్నది. 2019 మినహా 1952 నుంచి 12 సార్లు నిరంతరాయంగా ఈ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకున్నది.