దుండిగల్, డిసెంబర్7: సమాజహితం, ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపైనా శ్రద్దచూపాలని మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్‌రావు అన్నారు. కుత్బుల్లాపూర్ దుండిగల్‌లో గల మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల గ్రౌండ్ వేదికగా నేషనల్ ఎగ్ కో-ఆర్డీనేషన్ కమిటీ (నెక్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జర్నలిస్ట్ క్రికెట్ ప్రీమీయర్ లీగ్ (జేపీఎల్)ను ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ లీగ్‌లో పాల్గొంటున్న పది జట్ల జెర్సీలను ఆవిష్కరించడమే గాక టాస్ వేసి తొలి మ్యాచ్‌ను ఆరంభించారు.
ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. రాజకీయవేత్తలు, జర్నలిస్టులు, పోలీసులు, వైద్య వృత్తిలో పనిచేసేవారికి సెలవులుండవని, వారంతా వ్యక్తిగత జీవితం కంటే వృత్తికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని అన్నారు. నిత్యం బిజీగా ఉండే జర్నలిస్టులు పనిఒత్తిడి, ఫీల్డ్‌లో ఎండ, వానా లెక్కచేయకుండా తిరగడం, డెస్క్ జర్నలిస్టులు రాత్రివేళ పనిచేయడంతో చిన్నవయసులోనే బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కావున జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. జర్నలిస్టులు వారికోసం కొంత సమయం వెచ్చించి ఐదురోజుల పాటు ఈ లీగ్‌ను నిర్వహించుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఎంఎల్ఆర్ఐటీ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డిని హరీష్‌రావు సన్మానించారు. 80 ఏండ్ల వయసులోనూ ఆయన 21 ఏండ్ల యువకుడిలా ఉన్నారంటే ఫిట్‌నెస్‌కు లక్ష్మణ్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యతేనని ప్రశంసించారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే, ఎంఎల్ఆర్ఐటీ వ్యవస్థాపక కార్యదర్శి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు గౌరవ అతిథులుగా హాజరయ్యారు.