వెల్లింగ్టన్: వెస్టిండీస్, అమెరికా వేదికలుగా 2024లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం రోడ్‌మ్యాప్ మొదలైందని టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమితో భారత్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదలవుతున్నది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో కలిసి హార్దిక్ ఫొటోషూట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో పలు విషయాలపై పాండ్యా మాట్లాడాడు. ఇందులో ముఖ్యంగా మెగాటోర్నీల్లో అభిమానులను నారాజ్ చేయడంతో పాటు యువ క్రికెటర్లకు అవకాశాలపై స్పందించాడు.
టీ20 ప్రపంచకప్ టోర్నీకి రెండేండ్ల సమయమున్న నేపథ్యంలో అందరికీ అవకాశాలు వస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. చాన్స్ వచ్చిన ప్రతీసారి తమ ప్రతిభను నిరూపించుకునేందుకు యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. ఇంకా రెండేండ్లు ఉన్నందున అప్పటి వరకు చాలా టోర్నీలు ఆడాల్సి ఉంది. దీంతో మరిన్ని అవకాశాలు వస్తాయి. టీ20 ప్రపంచకప్ కోసం రోడ్‌మ్యాప్ ఇప్పటి నుంచి మొదలైనట్లే. మెగాటోర్నీ నాటికి మరింత మెరుగవ్వాల్సిన అంశాలపై దృష్టి సారిస్తాం. న్యూజిలాండ్‌లో క్రికెట్‌ను ఆస్వాదించేందుకు వచ్చాం. భవిష్యత్ ప్రణాళిక గురించి త్వరలో చర్చిస్తాం.
న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ, రాహుల్, అశ్విన్ లాంటి సీనియర్లు లేకపోయినా..సత్తాచాటేందుకు యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. గత రెండేండ్ల నుంచి యువకులు జాతీయ జట్టుతో కలిసి కొనసాగుతున్నారు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో వారి సత్తా నిరూపించుకునేందుకు ఈ సిరీస్‌లు ఉపయోగపడుతాయి. సవాళ్లను స్వీకరించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ప్రతీ సిరీస్ కీలకమైందే. స్వదేశంలో వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ టోర్నీ ఉంది. అందుకోసం ఇంకా సమయమున్నా..జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు క్రికెటర్లు నిలకడగా రాణించాల్సి ఉంటుంది.
టీ20 ప్రపంచకప్‌లో భారత్ వైఫల్యంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్యలపై పాండ్యా తనదైన రీతిలో స్పందించాడు. ‘మేం ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. పేలవ ప్రదర్శన కనబరిచినప్పుడు ఇలాంటి విమర్శలు రావడం సహజం. వారి వారి అభిప్రాయాలను వెలువరిస్తుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది. వాటిని మేము గౌరవిస్తాం.అంతర్జాతీయ స్థాయిలో ప్రొఫెషనల్స్‌గా మేము ఎవరికీ నిరూపించుకోవాల్సింది లేదు. ఆటలో మెరుగైన ప్రదర్శన కోసం ప్రయత్నిస్తాం. ఫలితం ఎలా ఉంటుందో మనం ముందే అంచనా వేయలేం. తప్పులపై దృష్టి సారిస్తూ ముందుకు సాగాలన్న ఉద్దేశంతో ఉన్నామని పాండ్యా పేర్కొన్నాడు.