టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. కొంత కాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. 2016లో భారత జట్టులో అరంగేట్రం చేసిన ఈ ముంబై ఆటగాడు కొన్ని మరపురాని ఇన్నింగ్సులు ఆడాడు. అప్పుడప్పుడూ కీలక వికెట్లు కూడా పడగొడుతూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే 2019లో వెన్నుకు ఆపరేషన్ జరిగిన తర్వాత అతను బౌలింగ్‌కు దూరమయ్యాడు.
అడపాదడపా తప్పితే బౌలింగ్ చేయలేదు. దీంతో భారత జట్టులో చోటు కూడా ప్రశ్నార్థకంలో పడింది. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్లో అహ్మదాబాద్ జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడని ఫ్రాంచైజీ యాజమాన్యం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో మాట్లాడిన పాండ్యా.. ‘జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొనే నన్ను నేను సిద్ధం చేసుకుంటూ వచ్చా. కానీ ఇప్పుడు శారీరకంగా, మానసికంగా సిద్ధమవడం కోసం కొంత విశ్రాంతి అవసరం అనిపించింది. కుటుంబం కోసం కూడా ఈ విశ్రాంతి ఉపయోగపడింది. బయోబబుల్స్‌లో ఎంత కంఫర్టబుల్‌గా ఉన్నా.. వాటిలో ఉండటం చాలా కష్టం’ అన్నాడు.
తనలోని లోపాలను సరిచేసుకునేందుకు, తప్పులు సరిదిద్దుకునేందుకు కొంత టైం కావాలని, విశ్రాంతి తీసుకోవడానికి అది కూడా ఒక కారణమేనని వెల్లడించాడు. కుటుంబానికి దూరంగా ఎక్కువ కాలం గడిపితే, అది కచ్చితంగా మనపై ప్రభావం చూపుతుందన్నాడు.
అలాగే తాను ఇప్పటి వరకూ నిశ్శబ్దంగా కష్టపడుతూ వచ్చానని, ఇకపై కూడా అలాగే చేస్తానని వివరించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో కచ్చితంగా చోటు సంపాదించాలనే పట్టుదలతో పాండ్యా ఉన్నట్లు తెలుస్తోంది.