Hardik Pandya | భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. అయితే, దీనిపై బీసీసీఐ అధికారిక సమాచారం ఇవ్వలేదు. గాయం నుంచి కోలుకున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ఆల్ రౌండర్ పూర్తిగా ఫిట్‌గా లేడని.. ఈ పరిస్థితుల్లో ఏమాత్రం తొందరపడకూడదని మేనేజ్మెంట్ భావిస్తున్నది. అయితే, ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లు మొదలయ్యే సరికి ఫిట్నెస్ను సాధించి.. జట్టులోకి రావాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది.
ఈ పరిస్థితుల్లో వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగే మ్యాచ్‌కు పాండ్యా అందుబాటులో ఉండడం కష్టమే. ఐసీసీ మెగా ఈవెంట్లో భారత్ ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లోనూ విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఇప్పటికే టీమిండియా సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో కీలకమైన ఆటగాళ్లు సైమీ ఫైనల్ మ్యాచ్‌లకు పూర్తి ఫిట్‌గా ఉండాలనుకుంటున్నది. పుణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.
ఆ తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లకు పాండ్యా లేకుండా టీమిండియా బరిలోకి దిగి.. వరుస విజయాలను నమోదు చేసింది. ఇక భారత్ శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో తలపడనున్నది. ఈ మూడు మ్యాచ్‌లకు పాండ్యాను దూరంగా పెట్టి.. సెమీ ఫైనల్స్ వరకు ఫిట్నెస్ను సాధించాలని టీమిండియా భావిస్తున్నది. ప్రపంచకప్‌లో మూడు మ్యాచులు ఆడిన ఆల్‌రౌండ్ ఐదు వికెట్లను కూల్చాడు. భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మాట్లాడుతూ.. పాండ్యా ఫిట్‌నెస్‌పై వైద్య బృందం దృష్టి సారించిందని చెప్పారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడని.. త్వరలోనే అప్డేట్ వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.