Hardhik Pandya – Natasha: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) భార్య నటాషా స్టాంకోవిక్(Natasha Stankovic)కు గుడ్ బై చెప్పేశాడు. నటాషాతో నాలుగేండ్ల బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్టు గురువారం పాండ్యా వెల్లడించాడు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తమ బ్రేకప్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. దాంతో, గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న హార్దిక్, నటాషా విడాకుల వార్తలు నిజమేనని రుజువైంది.
వరల్డ్ కప్ హీరోగా స్వదేశం వచ్చిన పాండ్యా వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అందరూ ఊహించినట్టుగానే భార్య నటాషాతో తెగతెంపులు చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఏం రాసుకొచ్చాడంటే..? ‘నాలుగేండ్ల దాంపత్య జీవితం తర్వాత పరస్పర ఒప్పందంతో నటాషా, నేను విడాకులకు సిద్ధమయ్యాం. కలిసి బతికేందుకు ఎంతో ప్రయత్నించాం. కానీ, కుదరలేదు.
దాంతో, ఇద్దరి ప్రయోజనాల మేరకు విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు పుట్టిన అగస్త్య ఇక ముందు కూడా మా ఇద్దరి ప్రేమను పొందనున్నాడు. కో పేరెంట్‌గా అతడికి అన్ని సమకూర్చడమే కాకుండా, అతడిని సంతోషంగా ఉంచుతాం. ఈ కష్ట సమయంలో మా గోప్యతకు భంగం కలిగించ వద్దని అభిమానులను కోరుతున్నా’ అని పాండ్యా వెల్లడించాడు.
భర్త పాండ్యాతో విడాకుల వార్తల నేపథ్యంలో నటాషా బుధవారమే(జూలై 17) కుమారుడు అగస్త్యను తీసుకొని సెర్బియా వెళ్లింది. దాంతో, వీళ్లద్దరి మధ్య బ్రేకప్ అయిందని, విడాకుల వార్త రావడమే ఆలస్యమని అనుకున్నారంతా. అందరూ అనుకున్నట్టే తమ బ్రేకప్ గురించి గురువారం పాండ్యా అధికారికంగా వెల్లడించాడు. అయితే.. సెటిల్మెంట్ కింద పాండ్యా తన సంపాదనలో సగానికి పైగా నటాషాకు సమర్పించుకోనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ ఆల్‌రౌండర్ 70 శాతం సంపద కోల్పోయే చాన్స్ ఉంది.
సెర్బియా మోడల్ అయిన నటాషాకు, పాండ్యాకు కరోనా సమయం (Corona Time)లోపెళ్లి అయింది. ప్రస్తుతం ఈ జంటకు అగస్త్య (Agastya) అనే పిల్లాడు ఉన్నాడు. అయితే.. హార్దిక్ – నటాషాలు ఈ మధ్యే రెండోసారి వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు. కొడుకు ఉన్నాక మళ్లీ పెండ్లి చేసకోవడానికి కారణం ఎంటో తెలుసా..? 2020 మార్చి 31న అతికొద్ది మంది సమక్షంలో కోర్టులో హార్దిక్, నటాషాల పెళ్లి జరిగింది. అది కరోనా టైమ్ కావడంతో సాదాసీదాగా వీళ్లిద్దరూ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.
అయితే… పరిస్థితులు చక్కబడ్డాక బంధు, మిత్రుల ముందు వైభవంగా మనువాడాలని హార్దిక్, నటాషాలు అప్పుడే నిర్ణయించుకున్నారు. అందుకు ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ముహూర్తం పెట్టుకున్నారు. ఉదయ్‌పూర్ వేదికగా కన్నులపండువగా వీళ్లు రెండోసారి వివాహం చేసుకున్నారు. తమ కుమారుడు అగస్త్యను ఎత్తుకొని మురిసిపోతూ ఫొటోలు దిగారు. అనుకున్నట్టుగానే తమ పెళ్లిని అందమైన జ్ఞాపకంగా మలచుకున్నారు.