Shreyas Iyer : సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు(Team India) ఆరు విజయాలతో సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. అయితే.. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) తిరిగి జట్టులోకి వస్తే పరిస్థితి ఏంటనేది అసక్తికరంగా మారింది. పాండ్యా వస్తే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) డగౌట్‌కే పరిమితం కావాల్సి రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కీలకమైన స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న అయ్యర్ ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో పెద్దగా ఆకట్టకోలేకపోయాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో పేలవ షాట్లతో పెవిలియన్‌కు చేరాడు. టోర్నీ ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో ఓపెనర్లు డకౌట్ అయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్.. కోహ్లీకి అండగా నిలువాల్సింది పోయి అప్పనంగా వికెట్ ఇచ్చేశాడు. ఇక ధర్మశాలలో ఇంగ్లండ్‌తో పోరులోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపించింది.
ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి శుభ్‌మన్ గిల్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా త్వరగా ఔట్ కావడంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాల్సిన బాధ్యత అయ్యర్‌పై పడగా.. మరోసారి అతడు బ్యాట్ ఎత్తేశాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇక వరల్డ్‌కప్ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) మాత్రం.. ఇంగ్లండ్‌పై చక్కటి ఇన్నింగ్స్(49 పరుగులు) ఆడాడు. తన సహజసిద్దమైన ఆటను పక్కన పెట్టి జట్టుకు అవసరమైన సమయంలో నెమ్మదిగా ఆడుతూ పోరాడే స్కోరు అందించాడు. దీంతో పాండ్యా జట్టులోకి వస్తే శ్రేయస్ అయ్యర్ స్థానానికి ఎసరు వచ్చినట్లే అనే వాదనలు ఎక్కువయ్యాయి.
సూర్యకుమార్ యాదవ్
ప్రపంచకప్ వంటి మెగాటోర్నీల్లో అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) పేర్కొన్నాడు. ‘స్వదేశంలో వరల్డ్‌కప్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని అనుకుంటారు. స్పిన్‌ను బాగా ఆడుతాడనే పేరున్న శ్రేయస్ మాత్రం మెగాటోర్నీలో ఇప్పటివరకూ అటువంటి ప్రదర్శన చేయలేదు. ఇలా అయితే హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చిన అనంతరం అతడి బదులు జట్టులో సూర్య కుమార్‌ను కొనసాగిస్తే.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో జట్టుకు మరింత సమతూకం చేకూరుతుంది’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.