CWC 2023: వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి ఐదు పరాజయాలతో అనధికారికంగా సెమీస్ రేసు నుంచి తప్పుకున్న ఇంగ్లండ్‌పై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20లలో ఆడే ఆటగాళ్లను తీసుకొచ్చి వన్డే ఫార్మాట్లో ఆడిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని కామెంట్ చేశాడు. 2019లో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు ప్రస్తుత జట్టుకు చాలా తేడా ఉందని, ఆ జట్టు ఇయాన్ మోర్గాన్ సేవలను మిస్ అవుతోందని వ్యాఖ్యానించాడు. వరల్డ్ కప్ సెమీస్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్.. 229 పరుగుల ఛేదనలో 129 పరుగులకే ఆలౌట్ అయి వంద పరుగుల తేడాతో దారుణంగా ఓడింది.
ఇంగ్లండ్ ఓటమి నేపథ్యంలో కమ్రాన్ అక్మల్ ‘ఎ స్పోర్ట్ప్’లో జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఇంగ్లండ్ ఇయాన్ మోర్గాన్ సేవలను చాలా మిస్ అవుతోంది. అతడి సారథ్యం అద్భుతం. మోర్గాన్ స్మాట్ కెప్టెన్సీతోనే ఇంగ్లండ్ 2019లో వరల్డ్ కప్ గెలిచింది. కానీ అది ఇప్పుడు మిస్ అవుతోంది. ఇంగ్లండ్ జట్టులో ప్రస్తుతం చాలామంది టీ20 స్టార్లు ఉన్నారు. వీళ్లు 50 ఓవర్ల ఆటను ముందుకు తీసుకెళ్లలేరు..’ అని చెప్పాడు.
అయితే అక్మల్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇప్పటివరకూ ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్ ఒకదాంట్లో గెలిచి ఐదింటిలో ఓడింది. మరోవైపు పాకిస్తాన్.. ఆరు మ్యాచ్‌లలో రెండు మాత్రమే గెలిచింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడింది. ఇంగ్లండ్ తో పాటు పాకిస్తాన్ కూడా వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్టే. ఇంగ్లండ్‌ను అనడానికంటే ముందు అక్మల్ తన టీమ్ గురించి ఆలోచించుకోవాలని ఇంగ్లీష్ టీమ్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు.