న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ఆసియాకప్ టోర్నీలో హార్డ్‌హిట్టర్ రింకూసింగ్‌కు బెర్తు దక్కేది ఒకింత అనుమానంగా మారింది. యూఏఈ వేదికగా జరుగనున్న టోర్నీ కోసం ఈనెల 19న బీసీసీఐ..భారత జట్టును ప్రకటించనుంది. అజిత్ అగర్కార్ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ జట్టులో ఎవరికి అవకాశమిస్తుందనేది ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రాక దాదాపు ఖాయం కాగా, యశస్వి జైస్వాల్‌ను తీసుకునే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతమున్న ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని గిల్‌ను ఎంపిక చేస్తే..అప్పుడు జట్టులో మార్పులు చేయాల్సి రావచ్చు.
టాపార్డర్‌లో ఇప్పటికే అభిషేక్‌శర్మ, సంజూ శాంసన్, తిలక్‌వర్మ, సూర్యకుమార్, హార్దిక్‌పాండ్యా ఖాయం కాగా, స్పెషలిస్టు బ్యాటర్‌గా కొనసాగుతున్న రింకూసింగ్ బెర్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. 2024 ఐపీఎల్ సీజన్‌తో పోలిస్తే..గత సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన రింకూను పక్కకు తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్టిండీస్‌లో జరిగిన 2024 టీ20 ప్రపంచకప్‌లోనూ రింకూ స్టాండ్‌బై ప్లేయర్‌గా కొనసాగాడు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో శ్రేయాస్ అయ్యర్ కూడా సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు, కానీ అతన్ని ఏ స్థానంలో ఆడించాలనేది సమస్య అని మాజీ సెలెక్టర్ వాపోయాడు. మరోవైపు నితీశ్‌కుమార్‌రెడ్డి, శివమ్‌దూబే, జితేశ్శర్మ కూడా పరిస్థితులకు తగ్గట్లు ఆడే క్రికెటర్లని, వీరిని కూడా ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలులేదని అతను పేర్కొన్నాడు.